పట్టణ వ్యవసాయం - ఆవశ్యకత
హరిత విప్లవం వల్ల అధిక దిగుబడి రకాలు వాడకంలోకి వచ్చాయి. అప్పటి నుండి రసాయన ఎరువుల వాడకం అధికమయింది. సాగునీటి వసతులు పెరగడంపల్ల, స్వల్పకాలిక రకాల సాగు వల్ల నిరంతరం పంటలు పండించడం ప్రారంభమయింది. దిగుబడులు గణనీయంగా పెరగడంతోపాటు చీడపీడలు కూడా ఎక్కువైనాయి. ఫలితంగా సస్యరక్షణ ఆవశ్యకత, ప్రాధాన్యత పెరిగింది.
రైతులకు సస్యరక్షణపై సరైన అవగాహన లేకపోవడం, నత్రజని ఎరువులు మోతాదుకు మించి వాడడం, చీడ పీడల నెదుర్కునే పొటాష్ తగిన మోతాదులో వాడక పోవడం, మొత్తం మీద పోషకాల సమతుల్యత పాటించక పోవడం వల్ల చీడపీడల ఉధృతి పెరిగింది. వీటి నివారణకు మందుల వాడకమొక్కటేననే భావనతో విచ్చలవిడిగా, విచక్షణా రహితంగా వాడడం జరిగింది. పురుగుకు, తెగులుకు పోషకలోపాలకు వుండే తేడాలను తెలుసుకోలేని స్థితిలో రైతులున్నారు. వీటిపై అవగాహనలేకుండానే చీటికి, మాటికి అధిక శక్తివంతమైన మందులు, సింథటిక్ పైరిత్రాయిడ్స్ వాడకం మొదలైంది. కొత్త సమస్యలు వచ్చాయి. దీనికితోడు కల్తీమందులు, నాసిరకం మందులు మార్కెట్లోకి వచ్చాయి. రైతులు అయోమయంలో పడ్డారు. ఖర్చులు పెరిగాయి. నికరాదాయం తగ్గింది. రైతులు నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. ఆత్మహత్యలకు పాల్పడడం జరుగుతుంది.
గడిచిన 40 సంవత్సరాల నుండి సస్యరక్షణ మందుల వెల్లువ ఎక్కువైంది. వీటి వాడకం ప్రతి సంవత్సరం పెరుగుతుంది. పంటలపై ఒకరకమైన విషాన్ని కాక, పలు రకాల విషాన్ని, విభిన్న కాలాలలో సంవత్సరం పొడవునా విరజిమ్ముతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం కనిపించడం వల్ల ఆ తర్వాత రసాయనాలకు కూడా గిరాకీ పెరిగింది. క్రిమి సంహారక మందుల వాడకంలో లాభాలతోపాటు నష్టాలను కూడా చవిచూడాల్సివచ్చింది. తీవ్ర సమస్యలు ఎదురైనాయి. కీటక నియంత్రణ అనేది పర్యావరణానికి సంబంధించిన విషయమనేది మరిచిపోయారు. కీటక నియంత్రణ అంటే రసాయనాలతో నియంత్రణ అనే భావం ఏర్పడింది. వ్యవసాయదారులు, పండ్లు, కూరగాయలు పండించేవారు, పెరటితోటల పెంపకం దార్లు, అటవీ యాజమాన్యం వారు, సంబంధిత అధికార్లు, సాంకేతిక నిపుణులు కూడా ఇదే భావనకు వచ్చారు. మానవజాతి కీటకాలపై రసాయనాల ద్వారా యుద్ధం ప్రకటించినా నిర్మూలించలేకపోయింది.
ఈ భూమి మీద సుమారు 15 లక్షల రకాల కీటకాలు కొలువుండగా అందులో 15 వేల జాతులే నష్టం కలిగిస్తాయని వెల్లడైంది. పోగా మిగిలినవి హాని చేయనివి. కొన్ని అనేక రకాలుగా మనకి ఫలసాయాన్నివ్వడంలో తోడ్పడేవి, మరికొన్ని హాని కల్గించే పురుగులను భక్షించేవిగా ఉన్నాయి. హానికలిగించే పురుగులు అదుపులో ఉండటానికి ప్రకృతిలోని సహజ నియంత్రణే ముఖ్యకారణం. ఈ సహజ నియంత్రణ లేకపోతే మానవుడు పురుగులతో పోటీ పడగలిగేవాడు కాదు. ఇది గుర్తించలేక పోవడమే రసాయన నియంత్రణలో సంక్షోభానికి, వైఫల్యానికి కారణం.
కీటక నాశనులన్నీ విష పదార్థాలే కనుక మంచివాటిని, చెడ్డవాటిని సమానంగా చంపుతాయి. హాని చేసే పురుగులు సహజంగానే బలంగాను, మేలు చేసే పురుగులు బలహీనంగా ఉంటాయి. అందువల్ల సహజ శత్రువులు త్వరగా నశిస్తాయి. దీని ఫలితంగా విషాన్ని తట్టుకొని నిలిచిన హానిచేసే పురుగులు సహజ శత్రువులు లేక విజృంభిస్తాయి. అప్పటివరకు సహజ శత్రువులు అదుపులో వుంచిన ఇతర చిన్న, చిన్న పురుగులు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. హానిచేసే పురుగులు ఒక రకానికి బదులు మరిన్ని రకాలు అధిక సంఖ్యలో దాడిచేయడం జరుగుతుంది. వీటిని నియంత్రించడానికి రైతులు మరింత విషాన్ని....................................