కార్మిక జనాభాకి, వర్గ స్పృహ కలగడానికీ, కార్మిక ఉద్యమాలు ప్రారంభమై సాగడానికీ, కార్మికుల పని స్తలాల్లో ట్రేడు యూనియన్లు (వృత్తి సంఘాలు ) ఎంత అత్యవసరమో చెప్పే పుస్తకం ఇది. కార్మిక ఉద్యమకారులు, పని స్తలాల్లో ట్రేడు యూనియన్లని ఏర్పరచాలనీ; వాటిని, ఆర్ధిక మెరుగుదలల దృష్టితో మాత్రమే గాక, కార్మిక వర్గ చైతన్య దృష్టితో నడపాలనీ ; గ్రహించకపోతే, ఆ కార్మిక ఉద్యమకారులు, యజమానుల వంతగాళ్ళుగా పనిచెయ్యడం తప్ప, కార్మిక జనాభా కోసం చేసేదేమీ వుండదని, ఈ పుస్తకం, అనేక దేశాలకు చెందిన ఉద్యమ చరిత్రలతో సహా చూపిస్తుంది
ఏం చేయాలి?
లెనిన్, ఈ వ్యాసంలో ప్రధానంగా చెప్పింది: “మనకు, రహస్యంగా పని చేసే విప్లవ పార్టీ కావాలి. దాని సభ్యులు హోల్ టైమర్లుగా (పూర్తి కాలం కార్యకర్తలుగా) ఉండాలి. దాని కన్నా ముందు రష్యా కంతటికీ సంబంధించిన విప్లవ రాజకీయ పత్రిక కావాలి. అటువంటి పత్రిక లేకుండా కేవలం ప్రాంతీయ పత్రికలతో మనం, ప్రజల్లో విప్లవ చైతన్యం కలిగించలేము. కార్మిక ఉద్యమం అంటే వేతన కార్మికులు, తమ సమస్యలు చూసుకోవడమే కాదు; ప్రజలలోని ఇతర సెక్షన్ల సమస్యల గురించి పని చెయ్యాలి. అన్ని సెక్షన్లనీ కలుపుకోవాలి. కార్మిక ఉద్యమం అంటే, కేవలం జీతాలు పెంచుకోవడమే కాదు. సోషలిజం ఎందుకు అవసరమో, ఆ కారణాలూ, ఆ బాధ్యతలూ, వివరంగా తెలియాలి. కార్మిక ఉద్యమాలు, సరైన మార్గంలో సాగే విధంగా, విప్లవ పార్టీయే వాటికి మార్గ దర్శకత్వం వహించాలి. మనం, సిద్ధాంతం విషయంలో చాలా వెనకబడి ఉంటున్నాము. మన పద్ధతులు చాలా మార్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి" - ఈ రకంగా ఉంటుంది.