ప్రారంభానికి ముందు
జులై 24, 2018
ఉత్తర థాయ్లాండ్లోని మా సెయ్ టౌన్లో ఉన్న ప్రముఖ బౌద్ధ దేవాలయం వాట్ ఫ్రా థాట్ డోయి వావ్ ఆరోజు చాలా సందడిగా ఉంది. గౌతమబుద్ధుడి కేశాలను ఈ గుడిలోనే భద్రపరిచారని చెబుతారు. అతిభారీ పరిమాణంలో ఉన్న వృశ్చిక విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఈ విగ్రహం ఎదురుగుండా నిలబడితే మయన్మార్ సరిహద్దు కనిపిస్తుంది. థాయ్లాండ్లో అనేక బౌద్ధ దేవాలయాల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా శివపార్వతులు, వినాయకుడి విగ్రహాలతో కూడిన ప్రత్యేకమైన ఆలయం ఉన్నది. వాట్ ఫ్రా థాట్ డోయి వావ్ ఆలయ ప్రాంగణం అంతా ఆ రోజు పూలతో అలంకరించబడి ఉంది. ఆకాశం మేఘావృతమై ఉంది. పొగమంచు ఇంకా వీడలేదు. సన్నని తుంపర వర్షం అప్పుడప్పుడు ఏదో మంత్రజలం చిలకరించినట్టే పడిపోతోంది. అక్కడ అలంకరించిన పూలు, వెలిగించిన అగరువత్తుల వాసన కలగలసి గాలిలో ఒక చిక్కని పరిమళం వ్యాపించి ఉంది. రెండు మూడుచోట్ల రాజు మహా వజిర లాంగ్ కార్న్ భారీ ఫోటో ఫ్రేములు పెట్టారు. తెల్లటి టీ షర్టులు, ప్యాంట్లు ధరించిన పదకొండు మంది పిల్లలు, ఒక యువకుడు దేవాలయం ముందు కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. ఆలయ ప్రధాన బౌద్ధ బిక్షువు మైకులో ఏదో పరిస్తున్నాడు. ఎదురుగా ఒక తాత్కాలిక స్టేజీ లాంటిది వేసి దానిమీద అనేక బుద్ధ విగ్రహాలు పెట్టారు. ఒక్కో విగ్రహం ముందు వెదురు బుట్టల్లో పూలు, పండ్లు, స్వీట్లు,..............