1వ భాగం
ఎండ కాస్తున్నా చల్లగానే ఉన్న ఏప్రిల్ రోజది. గడియారాలు పదమూడు గంటలు కొడుతున్నాయి. విన్స్టన్ స్మిత్ జివ్వుమంటున్న పాడుగాలిని కాచుకోడానికి గడ్డాన్ని గొంతుకు అదుముకుంటూ 'విక్టరీ మాన్షన్' భవనం అద్దాల తలుపు తీసి విసురుగా లోనికెళ్లాడు. తలుపు తెరిచి మూసేలోపే అతనితోపాటు దుమ్ముతెర కూడా లోపలికి దూరింది.
నడవాలో ఉడకేసిన క్యాబేజీ, పాత జంపఖానాల మాగిన వాసనలు. ఓ చివర గోడపై ఎబ్బెట్టుగా పెద్ద రంగుల పోస్టర్. దానిపై బారెడంత ముఖం. నలభై ఐదేళ్ల వయసు. నల్లటి పెద్దపెద్ద గుబురు మీసాలు. బలంగా, సొగసుగా ఉంది ముఖం. విన్స్టన్ మెట్లెక్కాడు. అక్కడ లిఫ్ట్ ఉన్నా పనిచెయ్యదు. రోజులు బావున్నప్పుడే అది ఎప్పుడో తప్పు పనిచేసేది. కాదు. ఇప్పుడు పగటిపూట దానికి కరెంట్ కోత. 'విద్వేష వారోత్సవం' కోసం అదో పొదుపు, విన్స్టన్ అపార్ట్మెంట్ చేరుకోవడానికి మెట్ల వరసలు ఏడు ఎక్కాలి. అతని వయసు ముప్పై తొమ్మిదేళ్లు. ఎడమ మడమపైన నరం పుండు సలుపుతోంది. మాటిమాటికీ ఆగి అలుపు తీర్చుకుంటూ ఎక్కుతున్నాడు. ప్రతి అంతస్తులోనూ లిఫ్ట్ ఎదురుగా గోడపై బారెడంత ఆ ముఖం పోస్టర్. నువ్వు ఎటు తిరిగితే అటు వెంటాడే ముఖం. 'బిగ్ బ్రదర్ నిన్ను గమనిస్తున్నాడు' అని పోస్టర్ల కింద హెచ్చరిక.
ఇంట్లో ఓ కమ్మని గొంతు దుక్క ఇనుము ఉత్పత్తి లెక్కలను వల్లె వేస్తోంది. కుడివైపు గోడపై మాసిన అద్దంలాంటి చదరపు రేకు పలక నుంచి వినిపిస్తున్నాయా మాటలు. విన్స్టన్ ఓ స్విచ్ వేశాడు. చదవరి గొంతుక కొంత తగ్గినా మాటలు స్పష్టంగానే వినిపిస్తున్నాయి. ఆ టెలిస్క్రీన్ కాంతిని తగ్గించవచ్చుగాని పూర్తిగా ఆఫ్ చెయ్యడం కుదరదు. కిటికీవైపు కదిలాడు. విన్స్టన్ పిట్టమనిషి, సన్నం, సున్నితం. చొక్కా, ప్యాంటు కలిసే ఉన్న పార్టీ నీలిరంగు ఓవరాల్లో మరింత అల్పజీవిలా కనిపిస్తున్నాడు. తలకట్టు మహా సొగసు. ముఖంలో సంతోషం, మొద్దు సబ్బు, మొద్దు బ్లేడ్లు, అప్పుడే ముగిసిన చలికాలం ఫలితంగా చర్మం గురుకెక్కింది.
కిటికీ అద్దం నుంచి కూడా బయటి ప్రపంచం చల్లగానే కనిపిస్తోంది. వీధుల్లో చిన్నపాటి సుడిగాలుల్లో దుమ్ము, కాయితమ్ముక్కలు గిరికీలు కొడుతున్నాయి. సూర్యుడు................
జార్జ్ ఆర్వెల్