స్వీయ అస్తిత్వ ఆవిష్కరణ నుంచి మూలాల అన్వేషణ వరకు
పాఠకుల పఠనానుభవం రచయిత రచనానుభవం కలిసే ఉమ్మడి క్షేత్రం వొకటి సాహిత్యతలంలో వుంటుంది. అక్కడ రచయితా పఠితా వొకరికొకరు సన్నిహితమౌతారు. సామీప్యాన్ని అనుభూతి చెందుతారు. భావాలు వినిమయం చేసుకుంటారు. దృక్పథాల్ని పంచుకుంటారు. ఒకరి మనస్సుని మరొకరు స్పృశిస్తారు. రచన మాధ్యమంగా వొక సంభాషణకు పూను కుంటారు. ఒక చైతన్యధార వొకరి నుంచి మరొకరికి ప్రవహిస్తుంది. నిజానికి రచన యేదైనా రచయిత తన పాఠకులతో యెదురెదురుగా కూర్చుని చేసే సంభాషణే. కాల్పనిక సాహిత్యంలో ఆ సంభాషణ సంవాదంగానో ప్రవచనం గానో మారకుండా దాన్ని కళాత్మక వ్యక్తీకరణగా రూపొందించటంలో రచయిత అనేక వ్యూహాలతో ముందుకు రావడం చూస్తాం. అదే ఆ రచనలో శిల్పంగా భాసిస్తుంది. ఆ యా స్థల కాలాలకు లోబడి పాఠకులకు చేరువ కావడానికి రచయిత యెంచుకుని నిర్మించుకునే సాధనం అది. నిర్దిష్ట జీవిత అనుభవాల్ని సాధారణీకరించడం ద్వారా వాస్తవాన్ని కాల్పనీకరించడం ద్వారా పాఠకుల్ని రచనలో తాదాత్మ్యం చేసే రసవిద్య అది. దాని రహస్యం. తెలుసుకోడానికి చేసే ప్రయత్నం నిరంతరం జరుగుతూనే వుంటుంది. “మీ టూ” కథాసంకలనంలో ఉమా నూతక్కి 'మిట్టమధ్యాహ్నం నీడ' కథ వచ్చినప్పుడు దాని నిర్మాణంలో చూపిన నైపుణ్యంతోపాటు వ్యక్తీకరణలో...............