ఆహార వైద్యము
కడుపులో కల్మషాలు చేరి ఆహారాన్ని అరిగించే ఇతర రసాలు సరిగా ఊరకపోతే తిన్నది జీర్ణంకాదు. ఎప్పుడైనా ఓసారి అలా వుంటే ఓపూట భోజనం మానేస్తే సరి అవుతుంది. రోజూ తిన్నది అరగకుండా వుంటే యీ క్రింది విధానాలు ఏవైనా అనుసరించవచ్చును. తిన్నది సరిగా జీర్ణంకాకపోతే ఆకలికూడా అవదు.
భోజనం మొదటి ముద్దలో ధనియాలపొడి కలుపుకొని తినటం అందరికీ తెలిసిన వైద్యం.
బియ్యాన్ని వేయించి, తరువాత అన్నం వండించి తింటే తేలిగ్గా జీర్ణమవుతుంది. అల్లంకొమ్ము చితకగొట్టి నీరు కలిపి వడగట్టిన అల్లం రసం ఉదయం నాలుగు చిన్నచెంచాలు, సుమారు ఔన్సుగా, కొన్ని రోజులు వాడితే అజీర్ణం పోతుంది. పండిన బొప్పాయిపండు ముక్కలు కొన్ని ప్రతిరోజూ తింటుంటే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది.
భోజనంలో వెలక్కాయపచ్చడి వాడితే పనిచేస్తుంది.
అన్నం కొంత తగ్గించి, మజ్జిగ అప్పుడప్పుడు త్రాగాలి. మజ్జిగలో జీర్ణశక్తిని గణ వుంది. ఆరోగ్యాన్ని పోషణను మజ్జిగ బాగా యిస్తుంది.
దానిమ్మపండ్లు తింటున్నా పనిచేస్తుంది. అవి దొరకకపోతే ఉల్లిపాయలు వుడకబెట్టి రోజుకు ఆరు తినవచ్చును. ఈ పద్ధతి కూడా బాగా పనిచేస్తుంది. రోజూ ఉదయంపూట చిన్నచెంచాడు జీలకర్ర నమిలి నీటితో మ్రింగినా జీర్ణశక్తి వస్తుంది.
మామిడిపండ్లు దొరికే కాలంలో ప్రతిపూట ఒక పండు రసం త్రాగితే యీ జబ్బు పోతుంది..........