అమ్మ రాసిన ఉత్తరం
భారతమ్మకి మనసంతా దిగులుగా ఉంది. తనలో తనే మాట్లాడు కుంటోంది. కొడుకు పుట్టిన అయిదేళ్ళకి కరెంట్ వైర్లు బిగించడానికి స్తంభ మెక్కిన భర్త కళ్ళముందే కరెంటుషాక్'కి గురై మరణించాడు. కొడుకుని చూసుకుంటూ ఆ షాక్'లోంచి ఇప్పుడిపుడే తేరుకుంటున్న ఆమె కష్టపడి పెంచుకున్న ఆ కొడుకు కూడా చదువుల పేరుతో దూరమవుతుండడంతో తట్టుకోలేక పోతోంది. భర్తపోయాక కూలిపనులు చేస్తూ కష్టపడి ఒక్కగానొక్క కొడుకుని పెంచి పెద్దచేసింది. ఇప్పటిదాకా ఉన్న ఊళ్లోనే చదివాడు. కాబట్టి కళ్ళముందే తిరిగాడు. ఎప్పుడూ వాడులేని లోటు తెలియలేదు. పదవతరగతి మంచి మార్కులతో పాసయ్యాడని పట్నంలో ఉన్న కాలేజీ వాళ్లు మెరిట్ సీటిచ్చారు. కళ్ళముందు ఆడుతూ పాడుతూ తిరిగిన కొడుకు తెల్లారగానే కాలేజీకి వెళ్లిపోతాడంటే ఆందోళనగా ఉంది భారతమ్మకి. ఎంత సర్ది చెప్పుకున్నా మనసు కుదుటపడట్లేదు. ఆలోచనలతో అటూ ఇటూ దొర్లుతూ కంటిమీద కునుకు లేకుండా జాగారం చేసింది.
తెల్లవారింది. లేచి కాలకృత్యాలు తీర్చుకుని వంటపనులు మొదలు పెట్టింది. 'మళ్ళీ ఎన్ని రోజులకి ఇంటికొస్తాడో, అక్కడ భోజనం ఇంట్లో ఉన్నట్లుగా ఉంటుందో ఉండదో” అనుకుంటూ కొడుకు ప్రజ్వలి'కి ఇష్టమైన వన్నీ చేయాలని ఆరాటపడసాగింది. పనులన్నీ అయ్యాక ప్రజ్వల'ని నిద్ర లేపింది. ఒళ్ళంతా తడిమి నుదుటిపై ముద్దు పెట్టుకుని "బాబూ... త్వరగా తయారవ్వు. బస్సుకి వేళ్ళవుతోంది..." అంది.
"అమ్మా... నన్ను పంపించేస్తావా..?” అన్నాడు ప్రజ్వల్.
భారతమ్మ ప్రాణం విలవిల్లాడింది. కళ్ళల్లో నీళ్ళు సుడులుగా తిరగసాగాయి. అయినా అవేమీ కనబడకుండా “అదేంట్రా నాన్నా అలా అంటావు? నువ్వు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తే మన బాధలన్నీ తీరిపోతాయి. నీ తల్లి పడే కష్టం నువ్వు పడకూడదనే కదా ఇష్టం లేక పోయినా నిన్నంతదూరం పంపుతున్నాను. లేచి త్వరగా తయారవ్వు..." ఆపుకుందామనుకున్నా ఆగని కన్నీళ్లను ఆపే ప్రయత్నం చేస్తూ బయటికి వచ్చింది...............