దృశ్యం చాలా ఎగిరిగా మారుతుంది. ఫక్తు వ్యాపార సినిమాలోని దృశ్యాలవలె సామాజిక చలనంలో కూడా వేగం పెరిగింది. ఒక విషయం గురించి ఆలోచిస్తుండగా మరో మార్పు తోసుకొచ్చి ముందటి ఆలోచనను అభావం చేస్తుంది. ప్రతి మార్పుకు ఆలోచనలే మూలం. అయితే ప్రగతి భావన లోపించిన సమాజాలలో తిరోగమన భావజాలం ముందు పీఠాన కూర్చుంటుంది. గతంలో తిరస్కారానికి గురైన సామాజిక ఆచరణ వర్తమానంలో ప్రభావశీలంగా ఉంటుంది. ఇది క్షీణ సమాజపు ప్రాథమిక లక్షణం.
ఒకప్పుడు గ్రామాలలో నగ్నంగా అమలయిన అన్‌టచబులిటి ఇవ్వాళ రూపం మార్చుకున్నది. వేల సంవత్సరాలుగా విద్యకు దూరమైన కులాలు ఈ పాతిక ఏళ్లలో ఉన్నత విద్య ముఖద్వారాలలోకి ప్రవేశించాయి. అయితే విద్యార్థులుగా, అధ్యాపకులుగా శూద్ర, అతిశూద్ర కులాల ఉనికిని సహించలేని అగ్రకులాలు కొన్నిసార్లు వాచ్యంగా, మరికొన్నిసార్లు వ్యంజనంగా అంటరాని తనాన్ని పాటిస్తున్నాయి. అంటరానితనం అనుభవిస్తే తప్ప అది చేసే గాయాన్ని ఏ పదాలతో వ్యక్తం చేయలేం. దాని క్రూరత్వం ద్రవీభవంగా ఉంటుంది. నేను సమాజాన్నిహేతుబద్ధంగా అర్థం చేసుకోవడం ప్రారంభించి ముప్పై ఏళ్లు గడిచింది. ఈ కాలంలో అధ్యయనం, అధ్యాపన సందర్భాలలో నేను అనుభవించిన అన్‌టచబులిటి నా ఒక్కడిదే కాదు, నాలాంటి ఎందరిదో. ఆ క్రమంలో ఈ
రెండు దశాబ్దాలలో రాసిన వాటిలో ఇరవై వ్యాసాలను ఎంపిక చేసి 'అకడమిక్ అన్‌టచబులిటి'గా పాఠకుల ముందుకు తెస్తున్నాము. గతంలో నా రచనలను పాఠకులు కొని సొంతం చేసుకున్నారు. అదే మాదిరిగా ఈ పుస్తకాన్ని ఆదరిస్తారని కోరుకుంటూ....
చింతకింది కాశీం
9 జనవరి, 2020
ఆర్-9