దుర్గ దారిలో తుఫాను గాడు... వాడి వెనుక నేను!
తుఫాను గాడు నాకు బాల్య స్నేహితుడు. వాడంటే నాకు ప్రాణం. కానీ నేనంటే వాడికి కోపం. ఎందుకంటే వాడు చెప్పిన పని ఏదీ నేను చెయ్యలేదు. కాదు కాదు; చెయ్యలేక పోయాను. వాడు తుఫాను రోజుల్లో పుట్టేడని వాడినందరూ అలాగే పిలుస్తారు. వాడి అసలు పేరేదో చెప్పకుండానే వాళ్ళమ్మ వెళ్ళిపోయింది. బడిలో మాష్టారు ఇంకేదో పేరు రాసుకున్నారు. బడి సమయమూ బక్కల (పశువుల) సమయమూ ఒకటే అవడం వల్ల బడిలో కంటే బక్కల తోనే ఎక్కువ గడిపేవాడు. అందుకని మాష్టారు పెట్టిన పేరు అలాగే రిజిష్టరు లోనే ఉండిపోయింది. వీడు మాత్రం 'తుఫాను గాడు' గానే బడి బయట మిగిలిపోయాడు. నాకు నడుస్తున్న గేదె మీద ఎలా ఎక్కి కూర్చోవాలో నేర్పింది వాడే. వాడికి, నాకు స్నేహం మా గేదెల వల్లే ఏర్పడింది. మా గేదెల్ని నేను కాస్తున్న రోజుల్లో ఒక గేదెని అదుపు చెయ్యలేక మా వూరి మర్రి మాను కింద ఏడుస్తూ కూర్చుండిపోయేను. వాడొచ్చి ఏటయ్యిందని అడిగితే చెప్పాను... శూలు గేదె తప్పోయిందని. క్షణాల్లో వెతికి పెట్టి చెట్టుకిందకి తెచ్చేడు. ఆ రోజు నుంచి నా గేదెల్ని వాడి మందతోనే కలిపే ప్రయత్నం చేసే వాడిని. అప్పుడు చెప్పాడు ఒక గేదెని ఎలా అదుపులో పెట్టాలో. దాని వీపు మీద కూర్చొని ఏదైనా వాద్యం వాయిస్తూ కూర్చుంటే మనం చెప్పినట్టు వింటుందన్న రహస్యం చెప్పాడప్పుడే. రెండు రోజులు ప్రాక్టీస్ చేస్తే తప్ప మా గేదె మీదకి ఎక్కలేకపోయాను. ఎక్కాను సరే ఏం వాయించాలి? ఏమి వినిపించాలి?
మునకాల కర్రని ఎడమ చంక కింద పెట్టి, మరో రెండు చిన్న కర్ర పుల్లల్ని సిరతలుగా మార్చి డప్పు దరువులు ఆ కర్రమీదే వాయించేవాడు. పిల్లలు ఇస్తే పాడు చేస్తారని ఇచ్చేవాళ్ళు కాదు. డప్పు వరసలన్నీ ఆ మునకాల కర్ర మీదే గేదె మీద కూర్చొని వాయించేవాడు. సాధారణంగా దొంగావులికి మెడలో "డిడగ” (గంట... పనస కర్రతో చేసేది డిడగ. అది మోగుతుంటే ఆవు ఎక్కడుందో తెలిసిపోయేది) కడతాం. కానీ తుఫాను....................