అడవి పుత్రిక
కష్టాల కడలిలో జన్మించి
అది తెలంగాణలోనే ఒక చరిత్రగల జిల్లా. ఆ జిల్లాలోనే ఓ మారుమూల ప్రాంతంలో ఉంది ఆ వూరు. అదే మా వూరు. చుట్టూ అడవులు, గుట్టలు, కొండలతో ముట్టడించబడిన ఆ గ్రామంలో దాదాపు నాలుగు వందల ఇండ్లు ఉంటాయి. తమ ఆచార వ్యవహారాలకు అనుగుణంగా తమ జీవితాలను గడుపుతుంటారు. అడవి తల్లి ఒడిలో అమాయకంగా, అక్షరజ్ఞానం కూడా లేక అజ్ఞానాంధకారంలో, తరతరాలుగా భూస్వాముల భూముల్లో కూలీలుగా బతుకీడుస్తుంటారు ఆ గ్రామంలోని ప్రజలు, తమకంటూ ఆస్తిపాస్తులు ఏమీలేక, తమలాగే తమకు కలిగిన సంతానానికి కూడా సదువు సంధ్యలు లేక బాల్యం నుండే దోపిడీ అణచివేతలకు గురయ్యే తమ దౌర్భాగ్యానికి పూర్వజన్మలో చేసుకున్న పాపాలే కారణమని సరిపెట్టుకుంటూ బ్రతుకులను కొనసాగిస్తుంటారు.
ఆ గ్రామంలో అలా ఆలోచించే కుటుంబాలలో మా కుటుంబమూ ఒకటి. అసలు మా పూర్వీకులు కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరానికి చెందిన వాళ్ళు. మా నాన్నవాళ్ళు వాళ్ళ అమ్మానాన్నలకు నలుగురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు మగపిల్లలు. అందులో మా నాన్న అందరికంటే చిన్నవాడు. అక్కల, అన్నల పెళ్ళిళ్ల తర్వాత అమ్మానాన్నలు చనిపోవటంతో ఎవరి బ్రతుకుదెరువుకు వారు విడిపోయారు. ముందు జీవితంలో స్థిరపడిన తర్వాతనే పెళ్ళి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో మా నాన్న బతుకుదెరువు కోసం వరంగల్ జిల్లాలోని నాగారం గ్రామానికి చేరుకున్నాడు.
ఎంత చదివినా పేదవాడికి ఉద్యోగం దొరకటం ఆనాటికీ ఈనాటికీ గగన
మే! అంతంత మాత్రమే చదివిన మా నాన్నకు ఏం ఉద్యోగం దొరుకుతుంది! అయినప్పటికీ నిరాశ చెందక తాతల కాలం నుండి తమను పోషిస్తూ వస్తున్న చేతివృత్తి టైలరింగ్ను నమ్ముకున్నాడు. టైలర్ గా స్థిరపడిన మా నాన్నకు కొంతకాలానికి మా అమ్మతో పరిచయమేర్పడింది. మా అమ్మమ్మ తాతలకు మగసంతానం లేక ఇద్దరూ ఆడపిల్లలే కావటంతో దూరప్రాంతాలకు ఇచ్చుకోలేక పెద్ద కూతురైన మా అమ్మను టైలర్గా స్థిరపడిన మా నాన్నకు ఇచ్చి వివాహం చేశాడు మా తాత.
అలా స్థిరపడిన మా కుటుంబానికి మేం ఐదు మంది సంతానం. అందులో నలుగురు ఆడపిల్లలం, ఒకడే మగపిల్లవాడు. ఈ మధ్యతరగతి కుటుంబాన్ని నాన్న................