చరిత్ర తొలి దర్శనం
నేను చరిత్రను...
అవును! నేను చరిత్రను, జరిగిపోయిన కాలానికి చిహ్నాన్ని, గతించిన కాలగమనాన్ని. ఈ సృష్టి ఆవిర్భవించినప్పటి నుంచీ వున్న దాన్ని. నాకు మరణం లేదు. ఆకలీ, వేదనా, దప్పికాలేదు. కానీ ప్రకృతి సృష్టించిన ప్రళయాలు, జీవులు చేసిన ఘోరాలే నా రోగాలు. మనిషి పుట్టాక, కొన్ని లక్షల సంవత్సరాల వరకు నన్ను ఎవరూ గుర్తించలేదు. రాతి యుగాలు, లోహయుగాలు, సాంకేతిక యుగాలు ఎన్నో దాటుకొని వేదాల దారిపట్టి, పురాణాలలోకి, కావ్యాల్లోకి ప్రవహించి, శాసనాల్లోకి దూరి వస్తూనే వున్నాను.
ప్రతి వర్తమానమూ గతిస్తుంటుంది. పుట్టబోయే ప్రతి క్షణమూ వర్తమానంగా మారుతుంది. వర్తమానంగా మారిన ప్రతి ఘడియా కాలగర్భంలో కరిగి పోతుంటుంది. అలా జారిపోయి గతించిన మరుక్షణం నుంచీ దాన్ని నా రూపంలోకి మార్చుకుంటాను. కాబట్టే నా రూపమంతా భూతమే. భూతద్దం వేసి చూడగలిగితే నా నిజరూపం గుర్తించగలరు... నేను కాలాన్ని కప్పుకొని నిద్రిస్తుంటాను. ఎప్పుడూ, ఎవరో ఒకరు నన్ను కదిపి మేల్కొలుపుతుంటారు. మరిప్పుడు నన్ను ఎవరు నిద్ర లేపారో తెలీదుగానీ... మేల్కొన్నందుకు మీకొక కథ చెప్పాలను కుంటున్నాను. ఏ కథయినా నా నుంచీ పుట్టేదే. కొందరు దానికి మసిపూసి మారేడుకాయ చేస్తారు. మరికొందరు కొత్త ముసుగు కప్పి దాన్ని తమకనుగుణంగా మార్చుకుంటారు. అలా సత్యానికి మరో అందమైన వస్త్రం కట్టబడిన ఓ మహత్తర కథని, అందులో నిజాన్ని మీకు చెప్తాను.
ఎన్నో కోటాను కోట్ల సంవత్సరాల క్రితం ఏమీలేని శూన్యం నుంచీ ఒక చిన్న అణువంత వెలుగు అవతరించి, అది పెరిగి, పెద్దదై, పేలి ఈ విశ్వమంతా ఏర్పడింది. ఎన్నో గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్ర, సూర్య, గ్రహ మండలాలు... కదులుతూ, తిరుగుతూ సాగిపోతూనే వున్నాయి. అలాంటి గ్రహాల్లో ఈ భూమొకటి. ఇందులో ఎన్నో మైదానాలు, అడవులు, బండలు, కొండలు, లోయలు, రాళ్ళూ.............