కోహినూరు - కోళ్లూరు యాత్ర
కృష్ణాతీరంలో, గుంటూరు జిల్లాలోని ఒక ఊళ్లో ప్రపంచప్రఖ్యాతి
గాంచిన కోహినూర్ వజ్రం దొరికిందని, ఆ వూరు కొల్లూరని ప్రచారమైంది. అందరూ పాతగుంటూరు జిల్లాలోని మండల కేంద్రమైన కొల్లూరని అనుకొంటారు. కానీ, గుంటూరు జిల్లా (నేటి పల్నాడు జిల్లా), బెల్లంకొండ మండలంలోని కోళ్లూరులో కోహినూర్ వజ్రం దొరికింది. వజ్రాలను మెరుగు పెట్టడంలో దిట్ట అయిన ఒక ఫ్రెంచి వజ్రాలవ్యాపారి ఔరంగజేబు హయాంలో కోళ్లూరును దర్శించి, అక్కడి వజ్రపు గనుల్లో వేలమంది కార్మికులు పని చేస్తున్నారని తన ప్రయాణ నివేదికలో పొందుపరిచాడు. పులిచింతల ప్రాజెక్టు నీటిముంపు గ్రామమైన ఈ కోళ్లూరును, కోళ్లూరుపేట అని కూడా అంటారు.
నేను, 2015 అక్టోబరు నెలలో ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో
'చేజారిన తెలుగు వెలుగు - కోహినూర్ వజ్రం' అన్న వ్యాసం రాశాను. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న జర్మన్ జిడిఆర్ రేడియోవాళ్లు (ఒక జర్మన్ దేశస్థుడు, ఇంకొకరు తెలుగు కెమేరామెన్) ఇద్దరు నన్ను సంప్రదించి, కోళ్లూరు వెళ్లి అక్కడ నా ఇంటర్వ్యూ తీసుకుంటామన్నారు.
విజయవాడలో, ఉదయం 5 గం.లకు బయలుదేరాము. బెల్లంకొండ డిఎస్పీగారి అనుమతితో ఆ ఊరుకు ఇన్నోవాలో వస్తుండగా నాగిరెడ్డిపల్లెలో 16వ శతాబ్ది శిథిలశివాలయం నా కంటపడింది. ఒక్క నిముషం ఆగి, పొలాల్లో దిక్కూమొక్కూ లేకుండా, గడ్డీగాదంతో కమ్ముకుపోయిన శిథిలాలు నన్ను వదిలిపెట్టడం లేదు. చుట్టూ చూచి, మళ్లీ రావాల్సిందేనని తీర్మానించుకొని కారెక్కాను. ఎందుకంటే చాలాదూరం పోవాలి....................