పల్లెదుఃఖం తెలిసిన కథకుడు బిజివేముల
చూసే కళ్ళుంటే, కంటికి చిక్కిన దృశ్యాల్ని పట్టుకునే తడిగుండె వుంటే, గుండెలకెక్కిన అనుభూతుల్ని కథగా రాసే నైపుణ్యముంటే మన చుట్టూ ఉన్న జీవితాల నిండా కథలే కనిపిస్తాయి. కథల్లేని నేల ఎదురు పడదు. నడిచిన ప్రతి అడుగులో కథలు మొలిచివుంటాయి. వాటిని ఏరుకోవటమే కథకుని పని.
ఒక నిర్దిష్ట ప్రాంతాన్నించి వచ్చిన కథకుడు తన కాళ్ల కింది నేలకు సొంత గొంతుక తొడిగి, దాని అనుభూతుల్ని కథలుగా చెప్పుకొంటూ పోతాడు. రాయలసీమ మెట్ట నేలల్లోంచి పుట్టుకొచ్చిన కథకులు ఎక్కువగా ఇక్కడి భూమి దుఃఖాన్ని గురించే గొంతెత్తారు. కె.సభా, పులికంటి, కేతు విశ్వనాథరెడ్డి, వైసివి రెడ్డి, పి. రామకృష్ణ, సింగమనేని నారాయణ లాంటి కథకులు చిన్న కథను పల్లె మార్గం పట్టించారు. నాగలి దుక్కుల్నీ, రైతు చెమటల్నీ, అప్పుడప్పుడు రాలే పుల్లజినుకుల్నీ, కమ్ముకొచ్చే కరువుల్నీ, రైతు ఆత్మహత్యల్నీ కథలుగా మలిచి ఇక్కడి మట్టివేదనను లోకానికి పరిచయం చేశారు. ఆ పరంపరలో వచ్చిన వాళ్ళమే తర్వాతి తరానికి చెందిన పాలగిరి, దాదాహయాత్ నేను వగైరా కథక మిత్రులమంతా.
ఆస్తులకు వారసులు లేకున్నా పర్లేదు కథకులకు వారసులు ఉండాలని బలంగా కోరుకునే వాడిని నేను. ఒక కథ ఆగిపోయిన చోట కొనసాగింపుగా మరో కథ పుట్టుకు రావాలి. ఒక తరంలో సమస్యగా ఉన్న విషయం తర్వాతి తరంలో కూడా సమస్యగానే మిగిలివుందో, సమాధానం దొరికిందో తెలియాలంటే ఒకరి వెనుక ఒకరు కథకులు తయారుకావటం తప్పనిసరి. నాకైతే ప్రతి 20 మైళ్ళ పరిధిలో ఒక కథకుడు పుట్టుకు రావాలని కోరిక. భాష పరిధి తెలుస్తుంది. మాండలికాల శక్తి బైటబడుతుంది. సంప్రదాయాల రహస్యాలు ఎరుకకొస్తాయి. ఒకరు అలిసిన చోట మరొకరు కొత్తగా లేచి సాగించిన నడకలు స్పష్టంగా కనిపిస్తాయి.
ఈ విషయంలో జిల్లాలోని అన్ని ప్రాంతాల కంటే ఎర్రగుంట్ల ప్రాంతం చాలా ముందంజలో వుంది. కేతు విశ్వనాథరెడ్డి, పి.రామకృష్ణ...............