ఎప్పుడో ఒకప్పుడు ఈ భవంతి కూలి పడిపోతుంది. అప్పటిదాకా నేను లేవాల్సిందే, నడవాల్సిందే, స్నానం చెయ్యాల్సిందే, తినాల్సిందే, నిద్రపోవాల్సిందే. వెలుతురు రావటానికి అవకాశం ఉన్న దీని పాడుబడ్డ తలుపుల కంతల నన్నింటినీ రోజూ తెరవాల్సిందే.
....ఎన్నో మైళ్ళ కవతల, నా అమ్మూ, నువ్వేం చేస్తున్నావు తల్లీ? ఎలా వున్నావు? నిన్ను ఎప్పుడు చూస్తానే నేను?
నీకు సాయం కోసమని ఎంతమంది పనిమనుషులను పంపించాను నేను? పనిమనుషుల చేతుల్లో పడ్డ వంటగది షావుకారు దగ్గర కుదువకు పెట్టిన కంచు చెంబు లాగా దుమ్ము, ధూళీ నిండి, చిలుము పట్టి నల్లగా అసహ్యంగానే ఉంటుంది. నిజమే. దాన్ని శుభ్రంగా వుంచుకోవాలన్న పట్టుదలతో కష్టపడి నువ్వు ఆరోగ్యం పాడు చేసుకున్నావు.. నువ్వు రాసిన ఉత్తరాన్ని అప్పు దాచిపెట్టినాడు, తలుపు చూరులో. సాలెగూళ్ళు, దుమ్ము దాన్ని కప్పేసి జాగ్రత్తగా కాపాడినాయి. అయినప్పటికీ నిన్ను కన్న ఈ తల్లి కళ్ళు ఆ ఉత్తరాన్ని కనుక్కున్నాయి. పనిపిల్ల దాన్ని నాకు చదివి వినిపించింది. నా కళ్ళల్లో వార్ధక్యపు సాలెగూళ్ళు అల్లుకుపోయి పరుచుకున్నాయి. అవి మనుష్యుల అలికిడి లేని ఇంటి తాలూకు మసకబారిన చీకటి కిటికీలుగా మారిపొయినాయి!
"అప్పూ, నేను రేపు వెళ్తున్నాను !"
"ఈ అమ్మకు ఒక్క చోట నిలకడగా ఉండటం చేతగాదు." కోడలు స్పందించింది. అప్పు దీక్షగా తను చదువుతున్న కాగితాలలో నిమగ్నమైపోయి వున్నాడు.
"నువ్వు ప్రసవించి ఇవాల్టికి యాభయ్యారు రోజులు గడిచినాయి కదా? బిడ్డ మంచిచెడూ చూసుకోవటానికి నారాయణి ఎలాగూ రాబోతున్నది. నన్ను దేనికింక అవసరం లేకున్నా ఇక్కడే కట్టిపడేసుకోవటం..?”..............