శ్రీరస్తు
స్పందన
“అస్తు శివేతరక్షతయె”
అగ్నితత్త్వం గురించి
"అగ్ని పురోహితం
యజ్ఞస్య దేవం ఋత్విజం
హోతారం రక్తధాతమం”
వేదంలో ఆది ఋక్కు ఇది. మహర్షుల అగ్ని హోత్రుని ఆదిలో పూజించిరి.
“అగ్న ఆయాహి వీతయె” (సామం లోనిది) ఆ ఋక్సామాలు రెండు జాయా పతుల వంటివి. జాయాపతులు వేరు వేరయిన లక్ష్యమొక్కటె.
అగ్నికి వైదిక పరిభాషలో అనేక నామాలు గలవు. పురోహిత, యజ్ఞదేవ, ఋత్విజ పేర్లు గలవు. 'శుచి' అని కూడ అందురు. శుచి యన పవిత్రుడని అంతట శుభ్రపరచువాడని, అందరిని పావనం చేయు వాడని భావం. అగ్నిని పరబ్రహ్మగా ఋషులర్చించిరి.
“అగ్నిర పూజ్యో దేవతానాం (శ్రుతి) "బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మగ్నౌ బ్రహ్మాణాహుతం" అని గీత. "దేవాయజ్ఞ అజన యంత" శ్రుతి. సురలు యజ్ఞం చేసారు. ఋషులతో యజ్ఞాగ్నికై 'అరణి' సంపాదించారు (అరణిని మధించి ఋషులు అగ్నిని సృజించిరి జనం గావించిరి. ఆదిమానవుడు కూడ అగ్నికై వెదకినాడు.
ఆ విధంగానే తోటపల్లి బాలకృష్ణ శర్మగారు ఆర్ష వాఙ్మయాన్ని శోధించి అగ్ని తత్త్వాన్ని సాధించిపెట్టిరి. శర్మగారి పెద్దలు, పెద్ద పెద్ద వేద పండితులు, సదాచార సంపన్నులు. అటువంటి ఉత్తమ వంశమనే 'ఖని' లోంచి వెలువడిన వారే ఈ పరిశోధక శిఖా 'మణి' శ్రుతి, స్మృతి పురాణ ఇతిహాస కావ్యములే కాక, ఉపనిషత్ సారస్వంలో నుండి దృష్టాంతాలు, ఉదాహరణలు, సందర్భాలను గ్రహించి అగ్నితత్త్వములను పరిపుష్టిగావించిరి.
వైదిక పరంగా అగ్నియే ప్రథమ పూజ్యుడుగా ఈ విషయాన్ని అన్ని విధాల వీరు సమర్ధించిరి. ఆది దేవుడగా గణపతికి మరి అగ్నికి అభేధమును నిరూపించిరి................