అజేయులు
అది ఒక అంతూపంతూ లేని కీకారణ్యం దానిలో ఒక సైనికదళం విసుగు విరామం లేకుండా ముందుకు సాగిపోతూంది. అంధకారంవలె అలముకున్న ఆ అడవిలో పోను పోను ఆ దళం లీనమై పోసాగింది.
అక్కడే జర్మను టాంకులు, విమానాలు, ఇంకా ఆ జిల్లాలో వ్యాపించివున్న ఇతర బందిపోటు ముఠాలు అపజయం పొందాయి. యుద్ధం వలన ఆ అడవిలో ఉన్న రోడ్లన్నీ ధ్వంసమైపోయాయి. కాని ఆ అడవి నేడక్కడ అజేయమైనది. మంచు కురవటం, మంచు గడ్డకట్టటం ఆగిపోయింది. భోజన సామాగ్రి, మందు గుండ్లు సామానుగల ట్రక్కులు చాలా దూరాన అడవి అంచున చిక్కుబడి పోయాయి. అంబులెన్సులు, అడవిలో బిక్కుబిక్కు మంటూ అక్కడక్కడా వున్న పల్లెల్లో ఆగిపోయి వున్నాయి. ఫిరంగిదళం వద్దవున్న వంటచెఱకు అయిపోయింది. వాళ్ళ ఫిరంగులు కూడా వూరూపేరూలేని దూరంగా వున్న నదుల గట్లవెంట పడివున్నాయి. భూసైన్యానాకీ వాటికీ మధ్యనున్న దూరం క్షణక్షణానికీ పెరిగి పోతుంది. ముందు పోతున్న భూసైన్యం అవాంతరాలేవీ లెక్కచేయకుండా ముందుకే సాగిపోతుంది. పోనుపోను నడక సన్నగిల్లింది. ఆత్మవిశ్వాసం తగ్గినకొద్దీ మనుషులకు అలసట అధికం కాజొచ్చింది. సరిగ్గా ఈ అవకాశం చూసుకుని జర్మనులు, మిగిలిన సామాగ్రినంతటినీ అక్కడే పారవేసి బరువు తగ్గించుకుని పడమటి దిక్కుగా పారిపోయారు........................