శ్రీ సీతారామ జననం (1944)
'ధర్మపత్ని' (1941) చిత్రంలో బాలనటుడుగా తెరపై కనిపించిన అక్కినేని నాగేశ్వరరావుకు హీరోగా తొలి చిత్రం 'శ్రీ సీతారామజననం'. దీనికి నిర్మాత, దర్శకుడు ఘంటసాల బలరామయ్య.
దశరథుడు పుత్రకామిష్టి యాగం చేసిన ఫలితంగా శ్రీ మహావిష్ణువు కౌసల్యాదేవికి శ్రీరామచంద్రునిగా జన్మిస్తాడు. విశ్వామిత్రుని కోరికపై సోదరుడు లక్ష్మణునితో సహా అడవులకు వెళ్ళి తాటకాది దానవులను సంహరించి యాగ రక్షణ చేస్తాడు. జనక మహారాజు నాగటిచాలులో లభించిన బాలికకు సీత అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకొంటాడు. ఆమె శివధనుస్సును అవలీలగా కదలిస్తుంది. సీతా స్వయంవర సమయంలో శివధనుస్సును ఎత్తబోయి భంగపడతాడు దశకంఠుడు. విశ్వామిత్రుని ఆశీస్సులతో శ్రీరాముడు శివధనస్సును ఎక్కు పెడతాడు. దాంతో సీతావరమాలను శ్రీరామచంద్రుని మెడలో వేస్తుంది. సీతారాముల కళ్యాణంతో చిత్ర కథ సమాప్తమౌతుంది.
ఇందులో శ్రీరామచంద్రునిగా అక్కినేని నటించగా, ముగ్ధ మోహన మనోహరమైన సీత పాత్రను పోషించారు బాలాత్రిపురసుందరి. ఆమె అక్కినేనికి తొలి చిత్ర కథానాయిక. దువ్వూరి రామిరెడ్డి, బలిజేపల్లి లక్ష్మీకాంతకవి రచన చేయగా ప్రభల సత్యనారాయణ, ఓగిరాల రామచంద్రరావు సంగీతాన్ని అందించారు. ................