అల్లుడి రాజకీయం
ఒకరోజు మా అల్లుడు ఒకటే ఉగ్గబట్టి ఏడవబట్టినాడు. ఏమయిందోనని మంత్రులు, ఎమ్మేల్యేలు అందరూ గుంపుగా వచ్చి జేబుల కర్చీఫ్ లు తీసి ఒకేసారి ఇచ్చినారు. అయన్నీ నీళ్ళతో తడిసిపోయినా ఆయనగారు ఏడుపు ఆపందే. ఏమయిందన్నా - ఇలా చెప్పకుండా బావురుమంటే మాకు కాలు చెయ్యి ఆడట్లే. ఏమయిందో చెప్పరాదూ... అని గడ్డం పుచ్చుకుని బతిమాలుడే బతిమాలుడు. ఇంకా ఎక్కువసేపు ఆ సీన్ పొడిగిస్తే వాళ్ళంతా ఎళ్లిపోతారని బయపడి, ఏంలేదు తమ్ములారా, నా మావ నాకు బోర్డు అన్నాయం జేసినాడు. ఆయన పిల్లని నాకిచ్చి పెండ్లయితే జేసినాడుగానీ ఒక్క ఎర్ర ఏగానీ ఇచ్చుకున్నాడా? పోనీ నేనే కష్టపడి ఆళ్ళదగ్గర ఈళ్ళదగ్గర చేతులు చాపి మరీ అడుక్కుని పదో పరకో సంపాదించుకుంటే దానికీ ఏడుపే. నామీద ఎంక్వయిరీ పెట్టాలని పారిటీ మీటింగులో అందరిముందు బట్టుకుని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టబెట్టినాడు. అయన్నీ మనసులో బెట్టుకోక, పోనీ పెద్దాయనలే - మా నాయన తిడితే పడతన్లా అనుకున్న. అదట్టాబోయిందా - మాతోడల్లుడ్ని తెచ్చి నా నెత్తిమీదనే బెట్టినాడు. ఆడికి మంతిరి పదవిచ్చి నాకు మాత్తరం చాకిరీ చేసే సెక్రట్రీ పదవి గట్టబెట్టినాడు. ఇక జూడూ పొద్దుగాల ఆపీసుకుబోతే ఇంటికి చేరేదానికి రాతిరి పన్నెండు గంటలకు తక్కువేగాకుండె. అట్టా ఒకరోజు, రెండు రోజులా ఏళ్ళతరబడి బండచాకిరీ చేసినానా లేదా - మీ అందరికీ ఆ ఇసయం తెలియదా ఏమి? అన్నం కూడా ఆపీసులోనే తింటినిగందా - ఇంకెప్పుడు బోయిలే. అదేదో గాడిద చాకిరీ అంటారే అట్లా జేస్తినా - ఈయనేమో పదవిలోకొచ్చాక జనంలో మంచిపేరు కొట్టెయ్యటానికి పదకాలమీద పదకాలు బెట్టి ఆళ్ళ మనస్సులో దేవుడై కూచుండె. నేనే ఎదవలాగా ఏ పదవీ లేకుండానే దెయ్యాన్నై పోతిని. అందరూ నన్నే తిడతావుంటే నా గుండె మాత్తరం ఎన్ని దినాలు ఓర్చుకుంటది. మీరే నాయం చెప్పండి. పూలు మా మామకు, రాళ్ళు నాకునా -ఎలా వుగ్గబట్టినానో నాకు తెలుసు. మా చిత్తూరు జిల్లాలో వున్న ఎంకటేసరసామికి తెలుసు. ఇన్ని కష్టాలు పడతావుండికూడా పార్టీ బాగుండాలని ఎంత రొస్టు పడ్డాను. పిచ్చోడి మాదిరి గుడ్డలేసుకున్నా. తలనూనె రాసి దువ్విందే లేదు..........