అవిశ్రాంత అక్షర పథికుడు
- కొండుభట్ల రామచంద్రమూర్తి
ఏబీకె ప్రసాద్ గారు జర్నలిస్టులకు స్ఫూర్తిప్రదాత. స్వేచ్ఛాప్రియుడు. నిరంతర అధ్యయనశీలి. శాస్త్రీయ దృక్పథం కలిగిన హేతువాది. ఏ పత్రికలో పని చేసినా ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వాలు పని చేస్తున్న తీరునూ, సమాజం స్పందిస్తున్న రీతినీ శ్రద్ధాసక్తులతో గమనిస్తూ వస్తునిష్ఠంగా వ్యాఖ్యానించే దార్శనికుడు. సంపాదకుడి స్వాతంత్య్రాన్ని పరిరక్షించడమే పరమావధిగా ఉద్యోగపర్వంలో కత్తిమీద సాము చేసిన కలంయోధుడు. ఆత్మగౌరవం ముందు సంపాదకహోదాను తృణప్రాయంగా పరిగణించిన మనస్సన్యాసి.
తొమ్మిది పదులలో అడుగిడుతున్నప్పటికీ 'సాక్షి'లో వారంవారం కాలమ్ క్రమం తప్పకుండా రాయవలసిందే. ఆ కాలమ్ తాజా సమాచారం ఇస్తూ ఆయా రంగాలలో ప్రవీణులను సందర్భానుసారం ఉటంకించవలసిందే. విషయం రాజకీయం కావచ్చు, శాస్త్రవిజ్ఞానం కావచ్చు, యుద్ధతంత్రం కావచ్చు. రాకెట్ సైన్స్ కావచ్చు. మానవీయ సన్నివేశం కావచ్చు. ప్రాంతీయ తత్త్వం కావచ్చు. మతమహమ్మారి కావచ్చు. రాజ్యాంగ ప్రమాణంగా, లౌకిక విలువలకు కట్టుబడి, మానవతా దృక్పథంతో నిర్మొగమాటంగా, నిర్భయంగా అన్వయించవలసిందే.
ఏబీకే ప్రసాద్ గారిని నేను మొదట చూసింది ఆయన 'ఆంధ్రప్రభ'లో 'రెసిడెంట్ ఎడిటర్గా పని చేస్తున్న రోజుల్లో. 'ఉదయం' దినపత్రిక ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్న సమయం. నేను అప్పుడు 'ఆంధ్రప్రభ'లో సీనియర్ సబ్ ఎడిటర్గా పని చేస్తున్నాను. ఛీఫ్ సబ్ ఎడిటర్గా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నాను. అంతలోనే సంపాదకుడుగా పని చేస్తున్న కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యంగారు వైదొలిగారు. పొత్తూరి...........................