చిత్తశుద్ధి, పట్టుదల, పోరాట పటిమ... మరింత సాంద్రీకృతం కావాలి
జీవిత చరిత్రలు, స్వీయచరిత్రలు చదవడం అధ్యయనం చేయడం అనేది నా వరకు ఇంటర్మీడియేట్ స్థాయిలో బాగా అలవాటయ్యింది. జీవితచరిత్రల విషయంలో రచయితల గొంతుక తీరు, స్వీయచరిత్రల విషయంలో రచయిత రాగద్వేషాలు కొన్ని సందర్భాలలో అవరోధాలుగా, ప్రతిబంధకాలుగా ఉండవచ్చు. అయినా ఒక మనిషి ఆ స్థాయికి ఎలా ఎదిగాడో, ఆ శిఖరం అడుగున ఉన్న తల్లి వేరు పోకడలేమిటో తెలుసుకోవడానికి, స్ఫూర్తి పొందడానికి ఈ ప్రక్రియను మించిన మరో ఆధారం అందుబాటులో లేదు.
రెండు దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు, సాహితీవేత్తలు, ఇతర ప్రముఖులు గురించి వ్యాసాలు, పుస్తకాలు వెలువరిస్తూనే వున్నాను. అయితే నా మదరాసు బదిలీ కారణంగా పొట్టి శ్రీరాములు సంబంధించి సగటు తెలుగు వ్యక్తుల అవగాహన స్థాయి చాలా తక్కువ ఉందని బోధపడటమే కాక, ఆ దిశలో కొంత కృషి చేయడానికి వీలు దొరికింది. ఇటువంటి సాధికారమైన పరిశోధన అవసరమనిపించి ఈ సంకలనంతో ముందుకు వచ్చాను.
తెలుగు భాష ఆధారంగా ఏర్పడిన రాష్ట్రానికి ప్రధాన కారణం పొట్టి శ్రీరాముల ఆమరణ దీక్ష, ఆత్మార్పణం అని మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రం కావాలనే డిమాండు అప్పటికి (1952) నాల్గు దశాబ్దాల క్రితం నాటిది. పొట్టి శ్రీరాములు ప్రధానంగా కోరిందేమిటంటే మదరాసు రాజధానిగా తెలుగు రాష్ట్రం ఏర్పడటం, తర్వాత మదరాసును కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం. ఈ విషయాన్ని పూర్తిగా గమనించకుండా మనం సాగడం ఆశ్చర్యకరం. కనుక పొట్టి శ్రీరాములుగారి పోరాట గాథను, బలిదానపు అసలు ఉద్దేశ్యాన్ని తెలియజెప్పాల్సిన అవసరం చాలా ఉంది............