పూర్వరంగం
మహానుభావుల మహత్కర్యాలను మననం చేసుకున్నపుడు, మరింత స్ఫూర్తిని పొందుతున్నపుడు; వారి జీవితాలు ఎంత గొప్పవో అని ఎన్నోసార్లు అనిపించేది! ఆ ఆసక్తి, ప్రేమ, గౌరవం కారణంగా జీవితచరిత్రలన్నా.. స్వీయచరిత్రలన్నా నాలుగైదు దశాబ్దాలుగా మక్కువ పెరుగుతూ వస్తోంది.
సైన్స్ రాసినా; చరిత్ర చర్చించినా; సాహిత్య, సామాజికాంశాలని స్పృశించినా నా దృష్టికోణం కొంత భాగం ఈ దిశగా మొగ్గి ఉంటుంది. కనుకనే గాంధీజీ, గురజాడ, సర్వేపల్లి, తాపీ, నార్ల, పప్పూరు, సర్దేశాయి, విద్వాన్విశ్వం మొ|| వారిపైనా ఇంకా 'సైన్స్ వైతాళికులు', 'సైన్స్ ధ్రువతారలు', 'ద్రావిడ శాస్త్రవేత్తలు', 'దక్షిణాంధ్ర దారిదీపాలు' వంటి ఎన్నో నా గ్రంథాలు దానికి సాక్షీభూతాలుగా ఉన్నాయి. అదే రకమైన ఆసక్తి తొలుత పొట్టి శ్రీరాములు గురించి పదేళ్ళ క్రితం మొదలైంది. కనుకనే 'అమరజీవి బలిదానం' పేరున పొట్టి శ్రీరాములు పోరాటగాథను ఎన్నో డాక్యుమెంట్ల సహితంగా 268 పుటల పుస్తకంగా 2018లోనే నిక్షిప్తం చేశాను!
మనలో చాలామందికి పొట్టి శ్రీరాములు తెలుగువారికో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి, ప్రాణాలు కోల్పోయిన అమరజీవిగానే తెలుసు! ఆయన జీవిత నేపథ్యం ఏమిటి? 1952లో నిరాహార దీక్ష ప్రారంభించక ముందు వారి జీవిత గమనం ఏమిటి? అని ఎంతోమందికి అవగాహనలేదు. అంటరానితనం నిర్మూలనకోసం, అట్టడుగు వర్గాల హక్కుల కోసం, హరిజనుల దేవాలయ ప్రవేశం కోసం ఎంతగానో కృషి చేసిన పొట్టి శ్రీరాములు జీవితం అపరకర్ణుడి గాథను పోలినది! ఆపర శ్రీ రామచంద్రునిగా గాంధీజీని భావించి, ఆయన విధానాలను, విలువలను పాటించిన అపర లక్ష్మణుడైన పొట్టి శ్రీరాములు చరిత్రను నా మాటలలో 2018 నుంచి ఆశగా ఉంది. ఈ ఆశకు దారివేసి చూపిన రాఘవేంద్ర పబ్లికేషన్స్ రాఘవేంద్రరావు 2023 మార్చిలో కోరడమూ,.............