పీఠిక
డా॥ అంబేడ్కర్ ఒక విశ్వ జీవన భావనా సముద్రుడు. తాను ఏ దుఃఖాన్ని అనుభవించాడో ఆ దుఃఖాన్ని నివారించడానికి తన జీవితాంతం పోరాడిన అవిశ్రాంత యోధుడు. అంబేడ్కర్ ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో చెందినవాడు కాదు. ఆయన ప్రపంచ మానవుడు. ప్రపంచాన్ని వెలిగించిన తత్వవేత్తలలో మొదటి వరుసలో నిలబడినవాడు ఆయన. గ్రీస్ తత్వవేత్తలైన సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్తో పోల్చదగినవాడు. అంబేడ్కర్ ఒక మేథో సంపన్నుడు, సృజనాత్మక భావనాశీలి. సామాజిక ప్రజాస్వామ్య వ్యవస్థ నెలకొల్పాలనే ఆశయంతో అంబేడ్కర్ మనుస్మృతిని దగ్ధం చేశారు. ఈ చర్య వలన ఆయన భావజాల రంగంపై జరిపిన యుద్ధ ప్రకటన ముందుకు వస్తుంది. బుద్ధుడు రాజ్యాన్ని నిరాకరించి సన్యాసాన్ని పుచ్చుకొన్నంత బలమైన చర్య ఇది. దీనితో హిందూ సామ్రాజ్యవాదం యొక్క ఆయువుపట్టును ఆయన నిరాకరించినట్లైంది. అంతే! హిందూ భావజాలరంగ యోధులంతా ఆయన ఎదురుగా నిలబడ్డారు. అంతటితో ఆయన తాత్విక యుద్ధభేరి మ్రోగించినట్టైంది. అప్పటి వరకు శూద్రులు, అతిశూద్రులు బ్రాహ్మణవాదంపై సమరానికి సిద్ధపడలేదు. అంబేడ్కర్ ఒక యుద్ధ యోధుడిగా మనుస్మృతిని తగులబెట్టారు. మనువు బౌద్ధ మతానికి పరమశత్రువు. అందుకే మనువు స్త్రీలపై అసమానత్వపు ఆంక్షలను విధించాడు. కుటుంబ జీవనంలోకి బౌద్ధం ప్రవేశించకుండా నిరోధించాలంటే స్త్రీలపై అసమానత్వపు ఆంక్షలు విధించాలని మనువు విశ్వసించాడు కనుకనే......................