రేపటికోసం
ప్రభాత సమయం. ఆ ఊరిలో వున్న వేణుగోపాలస్వామి గుడిలో అర్చకులు మాధవస్వామి గారు ఆరోజు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కారణం ఆ ఊరిలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న ప్రెసిడెంటు గారి మనవడి పుట్టినరోజు కావడమే. ఉదయమే కొడుకూ, కోడలూ, మనవడు, మనవరాలిని తీసుకుని గుడికొచ్చేరు. ప్రెసిడెంటుగారు. వారితోపాటే ఊరిలో పెద్దలు కూడా. ప్రెసిడెంటు గారి మనవడు ఎనిమిదేళ్ళ పిల్లాడు. జీన్స్ పాంటు, పైన బొమ్మలున్న టీషర్ట్ వేసుకుని ఆ గుడి ఆవరణలో పరుగులు పెడుతున్నాడు. అతన్ని అందుకుందుకు అతని చిట్టి చెల్లెలు బుల్లి బుల్లి అడుగులతో వెనకపడుతోంది. దానికి అందీ అందకుండా పరిగెడుతున్న ఆ పిల్లాడి మొహంలోని సంతోషాన్ని కన్నార్పకుండా చూస్తోంది ఆ గుడి అర్చకులు మాధవస్వామి గారి కోడలు మీనాక్షి.
అలా చూస్తున్న మీనాక్షి మనసులో అదే వయసున్న తన కొడుకు మెదిలాడు. తన కొడుకు ఈపాటికి యేం చేస్తుంటాడా అని ఆలోచిస్తున్న మీనాక్షికి గుండు పిలకతో, ఓ అంగోస్త్రం కట్టుకుని, తెల్లవారకట్లే లేచి, సంధ్యావందనం ముగించి, తోటి సహాధ్యాయులతో మంత్రం వల్లెవేస్తున్న తన ఒక్కగానొక్క కొడుకు గౌరీనాథశాస్త్రి కళ్ళముందు కొచ్చాడు. అలా ఆడుకుంటున్న ప్రెసిడెంటు గారి మనవడి వయసే వున్న తన కొడుకుకి ఓ ఆటా పాటా లేదు. ఎనిమిదేళ్ళు రాగానే మెళ్ళో ఓ జంధ్యం పోచ పడేసి, సంస్కృతం నేర్చుకుందుకు వేదపాఠశాలకి పంపేశారు. అక్కడ చదువు చాలా నియమనిష్ఠలతో చదవాలి. ఇదేదో రాజ్యాధికార మన్నట్టు వంశపారంపర్యంగా వస్తున్న ఈ గుడి అర్చకత్వం కోసం ఆ పిల్లాడు అంత చిన్నప్పుడే వేదపాఠశాలకి వెళ్ళవలసొచ్చింది.............