ముందుమాట
ప్రపంచంలో ఏఏ కాలాలలో ఏ ఏ రాజ్యాలుండేవి? ఏ ఏ రాజ్యాలను ఏ ఏ రాజులు పాలించేవారు? ఏ ఏ కాలాలలో ప్రజలు ఏ ఏ విధంగా జీవించేవారు? - అని తెలుసుకోవటమే ' ప్రపంచ చరిత్ర'
చరిత్రకూ - కాలానికి అవినాభావ సంబంధం ఉన్నది. ప్రధానంగా ఏ కాలంలో ఏమి జరిగిందో తెలుసుకోవడమే చరిత్ర. అందువల్ల ఏ చరిత్రనైనా కాల విభజనచేసి అధ్యయనం చేస్తారు.
చరిత్రకారులు ప్రపంచ చరిత్రను ప్రధానంగా మూడు యుగాలుగా విభజించారు. అవి : 1) ప్రాచీన యుగం 2) మధ్యయుగం 3) ఆధునిక యుగం. మానవ నాగరికతా ప్రారంభకాలం నుండి ప్రాచీన
రోమను సామ్రాజ్యం పతనం వరకు (క్రీ.శ. 476 వరకు) గల చరిత్రను 'ప్రాచీనయుగం' అంటారు.
ప్రాచీన రోమను సామ్రాజ్యం పతనం (క్రీ.శ. 476) నుండి ముస్లింలు కాన్స్టాంటి నోపిల్ నగర ఆక్రమణ (క్రీ.శ. 1453) వరకుగల చరిత్రను 'మధ్యయుగం' అంటారు. కాన్స్టాంటినోపిల్ నగరం ముస్లింలు ఆక్రమించిన నాటి (క్రీ.శ. 1453) నుండి నేటి వరకుగల చరిత్రను 'ఆధునిక యుగం' అంటారు.
ఇది ప్రపంచ చరిత్ర క్విజ్'. ఇందులో ప్రపంచ చరిత్రలోని ప్రతియుగం మీద చిన్న చిన్న ప్రశ్నలు ఉంటాయి. ఈ పుస్తకం నుండి మీరు మరింత ఎక్కువ ప్రతిఫలం పొందాలంటే ముందుగా 'ప్రపంచ చరిత్ర' గ్రంథాలు చదవాలి. ఇందుకు మీకు తెలుగు అకాడమీ వారు ప్రచురించిన డిగ్రీస్థాయి చరిత్ర గ్రంథాలు ఉపకరిస్తాయి. ఆ చరిత్ర గ్రంథాలను చదివిన తరువాత ఈ 'క్విజ్' చేస్తే మీ చరిత్ర పరిజ్ఞానం ఎంతో పెంపొందుతుంది...........