ముందుమాట
| భ్రమల కలలను చెదరగొట్టి నిజాల నడుమ నిలబెట్టే ప్రయత్నం !
| ఈ పుస్తకం శీర్షిక అమృతకాలం కాదిది... ఆపత్కాలం అనే మాట పూర్తి నిజం కాదు. పాక్షిక సత్యం మాత్రమే!
కొద్దిమందికి ఇది అమృతకాలమే! కాదనలేం!!
అత్యధికులకు ఇది ఆపత్కాలం అన్నది మాత్రమే ఔననగల నిజం!
గడచిన మార్చ్ 15 వ తేదీన శాశ్వతంగా కన్నుమూసిన, మన దేశానికి ఒకనాటి (1990-93) అడ్మిరల్ గా పనిచేసిన లక్ష్మీనారాయణ్ రాందాస్, తన మరణానికి ముందు 2022 ఆగస్టులో "ఆజాదీ - అమృత కాల్ - అచ్చేదిన్" గురించి రాస్తూ, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం అని కేంద్ర ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని తదనంతర కాలపు బడ్జెట్లలో ప్రస్తావన కూడా చేయకపోవటాన్ని ఎత్తి చూపారు. "పేదరికము, నిరుద్యోగము నిరక్షరాస్యత ప్రబలంగా ఉన్నాయి. వాగ్దానం చేసిన కీలకమైన రంగాలలో, అలాగే సార్వత్రిక ప్రమాణాలను అందుకోవటంలో, లక్ష్యాలను చేరుకోవటంలో మనం విఫలమయ్యాము." అన్నారు. అలాగే పెద్ద నోట్ల రద్దు, లాక్ డౌన్, జిఎస్టి, సిఏఏ, అగ్నిపథ్, అగ్నివీర్ పథకాలను పేర్కొంటూ... "నా బుద్ధికి కలుగుతున్న అనుమానం ఏమిటంటే, ఇవన్నీ కలగలిసి పేదలకు, వలస కార్మికులకు, ఇంకా దళితులు ఆదివాసులతో పాటు మైనారిటీలకు అత్యంత కష్టభరితమైన కాలాన్ని సృష్టించాయి." వీరికి తోడు నిత్యం అభద్రతలో జీవిస్తున్న మహిళలను, మధ్యతరగతి జీవులలో కింద శ్రేణిని కూడా కలుపుకుంటే ఆపత్కాలంలో ఉన్న ప్రజా సమూహాలన్నీ తేట తెల్లమవుతాయి....................