మా మాట
పోలీసు యంత్రాంగం ప్రజల శాంతి భద్రతలను కాపాడడం కోసం ఏర్పాటయిందనే భ్రమలు ఇంకా ఎవరికైనా ఉంటే (దురదృష్టవశాత్తూ చాలామందికే ఉంటాయి) వాటిని పటాపంచలు చేస్తుంది. ఈ పుస్తకం. సాధారణ పరిస్థితులలో ఈ భ్రమలకు కొంతైనా ఆస్కారం ఉందేమో గాని (పాలకుల) సంక్షోభ సమయాలలో మాత్రం వారు పూర్తిగా అవతలి పక్షం వైపే ఉంటారని తేటతెల్లం చేస్తుంది. ఈ పుస్తకం. ఒక్క పోలీసు యంత్రాంగమే కాదు ఆ పరిస్థితి వచ్చినప్పుడు శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కూడా వారికి తమ వంతు సహకారాన్ని ఎలా అందిస్తాయో వివరిస్తుంది పుస్తకం. మొదటిది అణచివేత రూపంలో, రెండోది అణచివేత చట్టాల రూపంలో మన అనుభవంలోకి వస్తాయి. అందుకే రెండు రకాల అణచివేతలనూ కలిపి 'అణచివేత - అణచివేత చట్టాలు' పేరుతో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాం .
'బాలగోపాల్ గారు చాలా విరివిగా రాసిన అంశాలలో పోలీసు అణచివేత కూడా ఒకటి. పోలీసు యంత్రాంగం 'స్వాభావికం'గా పాల్పడే అణచివేతతో పాటు ఆ అణచివేతకు ఎప్పటికప్పుడు కొత్త కొమ్ములు, కోరలు సమకూర్చి పెట్టే టాడా, పోటా, అఫ్సా వంటి చట్టాల గురించి ఆయన 1984-2009 మధ్య రాసిన వ్యాసాలివి. అంటే పాతికేళ్ళ కృషి. ఆ కాలంలో పౌర, మానవహక్కుల నేతగా ఆయన వేటినైతే నిత్యం చూస్తూ, పరిశీలిస్తూ, విశ్లేషిస్తూ వచ్చారో ఆ అనుభవ సారాన్ని ప్రతిఫలించే కృషి
ఈ పుస్తకాన్ని మూడు భాగాలు చేసి పోలీసుల అణచివేత స్వభావాన్ని వివరించే వ్యాసాలను ఒక భాగంగా, నిర్బంధాలు, నిషేధాలపై రాసిన వ్యాసాలను రెండో భాగంగా, పోలీసులకు విచ్చలవిడి బలప్రయోగ అధికారాలను కట్టబెట్టే చట్టాలలోని 'అన్యాయమైన' నియమ నిబంధనల గురించి రాసిన వ్యాసాలను మూడో భాగంగా వర్గీకరించాం. ఈ మూడో భాగంలో మళ్ళీ టాడా, సంఘటిత నేరాల నియంత్రణ చట్టం, పోటో - పోటా, సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టం, టెర్రరిస్టు చట్టాలకు సంబంధించిన వ్యాసాలను విడివిడిగా ఇచ్చాం. ఒక్క 'టాడా' గురించే ఇందులో ఐదు వ్యాసాలున్నా అన్నీ వేరు వేరు సందర్భాలలో రాసినవి. ఆ చట్టం ఇంకా ముసాయిదా............