బౌద్ధ మహాసేవకుడు అనగారిక ధర్మపాల
ఆధునిక కాలంలో బౌద్ధ మూర్తిమత్వం, అనగారిక ధర్మపాల రూపంలో మనకు మార్గదర్శకత్వం వహిస్తూవుంటుంది; అతని సార్వజనీన దృక్పథం మనకు ఆదర్శం. బుద్ధభగవానుని నిర్వాణం తరువాత మూడు శతాబ్దాలకు అశోకుడు బౌద్ధధర్మ పోషకుడై, ఆనాడు తన పాలనలోగల భారతదేశం, శ్రీలంక తదితర తూర్పు, మధ్య ఆసియా దేశాలలో బుద్ధుని సందేశాన్ని వ్యాపింపజేశాడు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా స్థూపాలు, చైత్యాలు, విహారాలు నిర్మించి, బౌద్ధాన్ని ఒక ఉచ్ఛదశకు తీసుకెళ్ళాడు. ఆధునిక కాలంలో, అనేక కారణాల వల్ల, బౌద్ధం కనుమరుగౌతున్న సమయంలో అనగారిక ధర్మపాల నిస్వార్థ సంకల్పంతో, అకుంఠిత దీక్షతో భారత్, శ్రీలంక తదితర ఆసియా దేశాలలో బౌద్ధాన్ని పునరుజ్జీవింప జెయ్యటమేగాక, ఉత్తర అమెరికా, యూరప్ = దేశాలలో సైతం, బౌద్ధ మేధావుల సహకారంతో, బౌద్ధధర్మాన్ని వ్యాప్తిచేసి, పూర్వప్రాభవాన్ని పునఃప్రతిష్ఠించే కార్యక్రమంలో సఫలీకృతుడై, ఆధునిక బౌద్ధచరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకొన్నాడు. అటువంటి బౌద్ధ మహాసేవకుని జీవితం గురించి, ఆయన చేసిన కృషి గురించి వివరించటం ఈ రచన ఉద్దేశం.
*
ధర్మపాల కుటుంబ నేపథ్యం - బాల్యం
16-19 శతాబ్దాల మధ్య పోర్చుగల్, డచ్ (హాలెండ్), బ్రిటిష్ వంటి యూరోపియన్ దేశస్థుల వరుస ఆక్రమణలతో, సిలోన్ (నేటి శ్రీలంక) ప్రజల జీవితాలలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకొన్నాయి. ఆక్రమణదారులు వారి మతం, భాష, ఆచారాలు, వస్త్రధారణ, ఆహారం, సంస్కృతులను, సింహళ ప్రజలపై రుద్దారు. వారు తమ ఆధిపత్యాన్ని బలపరచుకోవడానికి, రెండువేల సంవత్సరాలకు పైగా కాపాడుకొంటున్న బౌద్ధధర్మాన్ని, సంస్కృతిని, నాశనంచేయడం కోసం అనేక వ్యూహాలు రచించారు. సింహళ ప్రజలు తమకున్న పరిమిత వనరులను ఉపయోగించి,...................