సముద్రాల రామానుజాచార్య జీవనచిత్రం
ప్రపంచ చరిత్రను పరిశీలించినపుడు, ఆయారంగాలలో తండ్రికి తగ్గ తనయులు, తండ్రిని మించిన తనయులు కన్పిస్తారు. కొన్ని సందర్భాలలో తల్లీ కూతుళ్ళకు సైతం ఇది వర్తిస్తుంది. విజ్ఞానశాస్త్రంలో మేరీక్యూరి, ఐరిస్ క్యూరీ: విక్రమ్ సారాబాయి, మల్లికా రాజకీయ సారాబాయి ; క్రీడారంగంలో లాలా అమర్ నాథ్, మొహిందర్ అమర్నాథ్ ; రంగంలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధి ఇలా ప్రతి రంగంలోను తల్లితండ్రుల వారసత్వాన్ని సంక్రమింపజేసుకొని, ప్రఖ్యాతి గాంచిన గొప్ప వ్యక్తులు మనకు కన్పిస్తుంటారు.
తెలుగు సినీరంగంలోను నిర్మాతలు, దర్శకులు, నటుల విషయంలోనూ తండ్రీ కొడుకులు పేరుగాంచినవారున్నారు. ఉదాహరణకు తండ్రీ కొడుకులైన సి.పుల్లయ్య - సి.ఎస్.రావు దర్శకులుగా పేరు గాంచారు. అయితే సాహిత్యవిభాగానికి వస్తే చటుక్కున స్ఫురించేవారు, సముద్రాల ద్వయం! విపులార్ధంలో శ్రీమాన్ సముద్రాల రాఘవాచార్య, శ్రీమాన్ సముద్రాల రామానుజాచార్య. వీరిద్దరు తండ్రీ కొడుకులు. తండ్రిని సముద్రాల సీనియర్ అని, కొడుకును సముద్రాల జూనియర్ అని సినీరంగం సంక్షిప్తంగా యీ ఇరువురికి నామకరణం చేసింది. కారణం తండ్రితో పాటు సినీ రచన చేయడంతో పాటు, కొన్ని సందర్భాలలో ఒకే చిత్రానికి ఇద్దరూ కలిసి రచన చేయడం మూలాన, ఎవరు ఏది రాశారో/రాస్తున్నారో తెలియడం కోసం, వారి వారి సౌలభ్యం కోసం రూపొందించిన పేర్లే జనబాహుల్యంలోకి ప్రచారమై స్థిరపడ్డాయి.
రామాయణం ప్రకారం రాఘవుడు శ్రీరామచంద్రుడైతే, రామానుజుడు లక్ష్మణుడికి పేరు. అనగా అన్నదమ్ములు. కానీ సముద్రాల సీనియర్ మరియు జూనియర్లు మాత్రం తండ్రీ కొడుకులు!
రామాయణ కల్పవృక్షం, అవతారికలో ప్రాచీనాంధ్ర కవులలో అగ్రగణ్యులను స్తుతిస్తూ విశ్వనాథ సత్యనారాయణ గారు, “రుషి వంటి నన్నయ్య, రెండవ వాల్మీకి" అనే గొప్ప పద్యం రాశారు. ఈ పద్యంలో ఒక్కొక్కరిని ఒకే విశేషణంతో పరిచయం చేస్తూ, వర్ణిస్తాడు. అలా ఉత్తర హరివంశ కర్త, నాచనసోమన వద్దకు వచ్చేసరికి 'ఒకడు నాచన సోమన' అని ఎలాంటి విశేషణాలు లేకుండానే ముగిస్తాడు. అదొక ధ్వని ప్రధానమైన వ్యక్తీకరణ. అలా పేర్కొనడంలో ఒక ప్రత్యేకతను, కవి ప్రతిభను సూచించారు. 'గుంపులో గోవిందా' అని కాకుండా, 'గుంపుకే గోవింద' అనే అర్థంలో వాడారు...............