ప్రసిద్ధ ఫె సర్జన్ దంతవైద్యులు డాక్టర్ రమేష్ శ్రీరంగం వెలువరించిన “ఆందమె ఆనందం” పుస్తకం చదవటం ఒక అందమైన అనుభవం. సికిందరాబాద్ లో చాలా ఏళ్లుగా ఫేస్ క్లినిక్ నడుపుతూ బహుశా వేల సంఖ్యలో దంతాలకు, నోటికి, ముఖానికి సంబంధించిన కేసులను డీల్ చేసిన విశేషానుభవంతో డాక్టర్ రమేష్ రచించిన ప్రామాణిక గ్రంథమిది.
పూర్వం దంత వైద్యమంటే పళ్లు పీకటమని చాలామంది అనుకునేవారు. పళ్ల, చిగుళ్ల నొప్పి లేక బాధ మరీ భరించలేకుండా ఉన్నప్పుడే డెంటిస్టు దగ్గరికి జనాలు వెళ్లేవారు. కాస్మెటిక్ డెంటిస్ట్రీ ప్రాచుర్యంలోకి వచ్చాక అందానికి దంతాల ప్రాధాన్యం, వికారాలను సరిచేసుకునే అవకాశాల గురించి విద్యావంతుల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన పెరిగింది. పలువరస బాగుంటే నవ్వు బావుంటుంది. నోరు ఇంపుగా ఉంటే ముఖం సొంపుగా ఉంటుంది. దంతసిరికి సంబంధించి సామాన్యులను చికాకు పెట్టే చాలా సమస్యలకు ఈ పుస్తకంలో పరిష్కారం కనపడుతుంది. ఆంధ్రభూమి వారపత్రికలో ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్ నవలలు ఎన్నో రచించిన విఖ్యాత రచయిత ఎస్సెస్. శ్రీరంగం (డాక్టర్ ఎస్. ఎస్. శాస్త్రి ) గారి కుమారుడు అయినందువల్లేనేమో ఇందులో విడవకుండా చదివించే లక్షణం చక్కగా ఉంది. ప్రతి అధ్యాయాన్ని ఆకట్టుకునేలా మొదలెట్టి కథలాగా చెప్పుకుపోవటంవల్ల విషయం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఎప్పటికీ గుర్తుంటుంది. ఇందులోని వ్యాసాలు చాలావరకు నా సంపాదకత్వంలో ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చాయి. పాఠకుల మెప్పు పొందాయి.
ముద్రణ వ్యయం బాగా పెరిగి, సమాజంలో మొత్తంగా పుస్తక పఠనం మందగించిన కారణాన గ్రంథ ప్రచురణకు పలువురు వెనకాడుతున్న సమయాన సత్యమైన పుస్తకాన్ని వెలువరిస్తున్నందుకు రచయితను అభినందిస్తున్నాను.
- ఎం.వి.ఆర్. శాస్త్రి