ప్రవేశిక
ఈ గ్రంథము క్రీ.శ. 1000 నుండి క్రీ.శ. 1250 వఱకుగల కాలమున, అనగా మధ్య యుగమున, ఆంధ్రదేశ సాంఘికార్థిక పరిస్థితులను వివరించును. ఆంధ్రదేశము భారతవర్షమున చారిత్రక ప్రసిద్ధమైన భూభాగములలో నొకటి. దీనికి ఉత్తరమున ఒరిస్సా లేక ఉత్కళరాష్ట్రము, దక్షిణమున తమిళనాడు, పశ్చిమమున మహారాష్ట్రము, తూర్పున సముద్రతీరము గలవు. నీటి పారుదల, జల సమృద్ధి సమకూర్చు గోదావరీ, కృష్ణా, పెన్నా నదులాంధ్రదేశమును సారవంతముగ నొనర్చినవి.
తూర్పున తీరప్రాంతముండుటచేత, బంగాళాఖాతముద్వారా బర్మా, మలయా, ఇండోచైనా, జావా మొదలైన ప్రాద్దేశ ప్రాంతములతో వర్తక వ్యాపారములు సాగుటకు అనుకూలమైనది. భౌగోళికముగా, భారతవర్షమున కుత్తరమునకు, దక్షిణమునకు మధ్యగా నుండుటచేత ఆంధ్రదేశము ఔత్తరాహిక, దాక్షిణాత్య సంస్కృతులకు సమ్మేళనస్థానమైనది. అందును తీరప్రాంతము ప్రధానమగుటచేత, ప్రస్తుతపరిశ్రమకు చరిత్రలో నీఘట్టమే తీసికొనబడినది.
రాజకీయముగా క్రీ.శ. 1000-1250 చారిత్రక ప్రాముఖ్యము గలది. అంతకుముందు మూడున్నర శతాబ్దములుగా స్వతంత్ర పరిపాలనము చేసిన తూర్పు చాళుక్యులు, శాశ్వతముగా చోళుల కధీనులైరి. చోళ రాజుల పాలనము వలన మత సాంఘిక విషయములలో ననేకములైన మంచి మార్పులు వచ్చినవి. తమిళదేశమునకు, ఆంధ్రదేశమునకు సంబంధములు దృఢపడినవి.
క్రీ.శ. 1000కి ముందు తూర్పుచాళుక్యులు తమ స్వతంత్రమును కొంతకాలము కోల్పోయిరి. క్రీ.శ. 973లో కర్నూలు మండలమున పెదకల్లున కధిపతి జటాచోడ భీముడు తూర్పుచాళుక్యులను జయించి, రాజ్యమునంతయు వశపరచుకొనెను. అతడాకాలమున ప్రఖ్యాతిజెందిన రాజు, పరాక్రమశాలి. అందుచేత క్రీ.శ. 1003 వఱకును తూర్పుచాళుక్యుల కాతని జయించుటకు సాధ్యము కాలేదు. అది క్రీ.శ. 1003లో జరుగుటచేత క్రీ.శ. 1000 దీనికి మొదటి సంవత్సరముగా పరిగణింపబడినది.
ఇక క్రీ.శ. 1250 చివర సంవత్సరముగా నిర్ణీతమగుటకు చారిత్రక హేతువున్నది. క్రీ.శ. 1250 నాటికి కాకతీయ గణపతిదేవ చక్రవర్తి ఆంధ్రదేశమునంతయు జయించి,..........