బర్బాఘా కంజారీ
'రా! ఇట్లా రా!! నా చెవులు కోయ్! నేను భయపడేవాణ్ణి కాదు! ఇట్లా రా! వచ్చి నా చెవులు కోయ్!!'-బర్బాఘా అందరి చెవులు చిల్లులుపడేలా గట్టిగా అరిచాడు.
అతను మునికాళ్ళపై నించుని చుట్టూ తిరుగుతూ జబ్బలు చరుస్తూ అక్కడున్న వారికి సవాలు విసిరాడు. అటూ ఇటూ గెంతుతూ ఒక్కసారిగా దబ్బున కూచున్నాడు. అతని విన్యాసం చూసి చూసి అక్కడున్న కుల పెద్దలంతా విస్తుబోయారు.
'నేను భయపడేది లేదు! రండి! వచ్చి నా చెవులు కోయండి!' అంటూ బర్బాఘాయే సవాలు చేయడం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. కొద్దిసేపటికి తేరుకున్న కుల పెద్దలు పంచాయతీలో తామిచ్చిన తీర్పును ఖాయం చేశారు. బర్బాఘా చెవులు కోసేందుకు సన్నాహాలు చేయసాగేరు.
అది ముంబయి మహానగరంలోని ఒక ప్రాంతం. అక్కణ్ణుంచి ఒక వేపు బి.బి.సి.ఐ రైల్వే లైను చర్చి గేటు వేపు సాగిపోతుంది. మరోవేపు జి.ఐ.పి. రైళ్ళు కల్యాణ్ వేపు ప్రయాణిస్తాయి. ఈ రెండు లైన్లను కలిపే రైలు పట్టాలను ఆనుకొనే ఆ ప్రాంతం ఉంది. మధ్యమధ్యలో కరెంటుతో నడిచే రైలు దడదడ భారీ శబ్దాలు చేసుకుంటూ వెళుతూ ఉంటుంది.
ఒక రకంగా ఆ ప్రాంతం మూడువేపులా రైలు పట్టాలు పరుచుకున్న ద్వీపంలాంటిదని చెప్పొచ్చు. అక్కడ వేల గుడిసెలు వేసుకుని చాలామంది ఉంటున్నారు. ఆ పూరిళ్ళు దూరందూరంగా ఉండవు. ఒకదానితో మరొకటి చేర్చి కట్టుకున్న గుడిసెలను చూస్తే నగరానికి దూరంగా విసిరేసిన బస్తీలా కనిపిస్తుంది. ఆ గుడిసెల నెత్తి మీద టాటా పవర్ స్టేషన్కు చెందిన ఒక భారీ టవర్... అలాంటి టవర్లపై లావుపాటి బరువైన హైటెన్షన్ వైర్లు సముద్రాన్ని లంఘించి ఎక్కడో దూరాన సహ్యాద్రి పర్వతశ్రేణుల్లోకి మాయమైపోతాయి. పవర్ స్టేషన్ హైటెన్షన్ వైర్లు కూడా ఈ బస్తీ పక్కనే వెళుతూ ఆకాశంలో ఊయలలు ఊగుతాయి. దగ్గర్లో ఉన్న టాటా పవర్ కంపెనీ ప్లాంటు పెద్ద శబ్దం చేస్తోంది. వరుసగా ఒక లైన్లో నించుని కవాతు ........................................