వెస్టేలియా రాజ్యంలోని థండర్డెన్ ట్రాంక్ జమీందారు కోటలో సద్గుణ సంపన్నుడైన యువకుడొకడు నివసించేవాడు. మనిషి ఎలాంటి వాడో ముఖం చూస్తేనే తెలిసిపోతుంది. ఏది మంచో, ఏది చెడో అతనికి బాగా తెలుసు. కల్లాకపటం లేని మనసు. అందుకే కాండీడ్ (నిష్కపటి) అని పేరుపెట్టి ఉంటారనుకుంటాను. అతని పుట్టుపూర్వోత్తరాల గురించి పెద్దగా తెలియదుగానీ ఆ కోటలోని ముసలి నౌకర్లు మాత్రం అతడు జమీందారు సోదరికి ఆ చుట్టుపక్కలుండే ఓ పెద్దమనిషి వల్ల పుట్టాడని చెవులు కొరుక్కునేవాళ్లు. సదరు పెద్దమనిషి ఉట్టి పెద్దమనిషేకానీ అతని పూర్వీకులకు సంబంధించి కేవలం డెబ్బై ఒక్క పెళ్లిళ్ల వివరాలే ఉండడం, వంశవృక్షంలో మిగతాది కాలపురుషుడి దెబ్బలకు దుంపనాశనమవడం వల్ల జమీందారు సోదరి పెళ్లికి నిరాకరించిందట.
జమీందారు ఆ రాజ్యంలోని శక్తిమంతులైన ప్రభువుల్లో ఒకడు. ఎందుకంటే, ఆయన భవనానికి తలుపే కాదు బోలెడన్ని కిటికీలు, లోపలి పెద్ద మందిరంలో ఖరీదైన తివాచీ వేలాడుతూ ఉంటుంది కనక! ఆయన వేటకెళ్తే పెరట్లోని ప్రతి కుక్కకూ పనే. అన్నీ రేచుకుక్కల్లా దండు కడతాయి. గుర్రాల కాపర్లే వేటగాళ్లు. స్థానిక చర్చి అధికారి ఆయనకు ప్రధాన పురోహితుడు. ప్రజలు జమీందారును 'ధర్మప్రభువులు' అని పిలుచుకునేవాళ్లు. అతని ఛలోక్తులకు పొట్టచెక్కలయ్యేలా నవ్వేవాళ్లు.
ఇక జమీందారిణి సంగతి. మూడువందల యాభై పౌండ్ల బరువు కారణంగా ఆమె కూడా ఏ మాత్రం విస్మరించరాని ప్రముఖురాలైపోయింది. ఇంటి సంప్రదాయాలను తూచా తప్పకుండా అమలు చేయిస్తూ బోలెడంత గౌరవం మూటగట్టేసుకుంది. ఆమె కూతురు క్యూనెగొండ్కు పదిహేడేళ్లు. లేత గులాబీరంగు, కాస్త బొద్దుగా ఉండే ఒంపుసొంపుల ఒళ్లు, అందమైన ముఖంతో చూడముచ్చటగా, మతిపోగొట్టేలా ఉంటుంది. జమీందారు కొడుకు తండ్రికి తగ్గ తనయుడు. అతని గురువు పాంగ్లాస్. ఆ ఇంటి సిద్ధాంతి. మహామేధావి, పండితుడు. అతని మాటపై అందరికీ గురి. పాంగ్లాస్ వయసు, వ్యక్తిత్వం, సర్వజ్ఞత్వంపై గౌరవంతో కాండీడ్ ఆయన బోధనలను అచంచల విశ్వాసంతో వింటుండేవాడు.
పాంగ్లా సృష్టి సంబంధమైన అధిభౌతిక, మతతాత్విక విషయాలను బోధించేవాడు. ముఖ్యంగా కార్యకారణ సిద్ధాంతాన్ని అరటిపండు ఒలిచినట్టు వివరించేవాడు. కారణం............