అమ్మ, నాన్నల జీవితాలు
సంఘసంస్కరణ ఉద్యమం చివరి దశలో స్వతంత్ర పోరాటం ప్రారంభమైన మొదటి దశలో జన్మించిన వ్యక్తి మా నాన్న. గ్రంథాలయోద్యమానికి పేరు పొందిన వేటపాలెం (ఇప్పటి ప్రకాశం- అప్పటి గుంటూరు జిల్లా) అమ్మ జన్మస్థలం. ఆయన పుట్టిన ఒక దశాబ్దం తర్వాత జన్మించిన అమ్మ బడిలో చదువుకునే రోజులకి గ్రంథాలయోద్యమం తెలుగునాట ఊపందుకుంది. అమ్మ 'సీత', ఆమె చెల్లెలు 'శేషు' ఎనిమిదో తరగతి వరకు వేటపాలెంలోనే చదువుకున్నారు. ఇళ్ళల్లో ఉండే ఆడవాళ్ళు చదువుకోవటానికి వేటపాలెం లైబ్రరీ నుంచి పుస్తకాల్ని ఇళ్ళకు పంపించే పద్ధతి ఆ రోజుల్లో ఉండేది. తెలుగు సాహిత్యం, ఎన్నో ప్రముఖ రచయితల రచనలు అనువాదంలో అప్పటికే ఉన్న బెంగాలీ సాహిత్యంతో సహా, అమ్మ, పిన్ని వాళ్ళకు అన్ని రకాల పుస్తకాలూ చదివే అవకాశం అట్లా లభించింది. స్త్రీలు పెద్ద చదువులు చదవాలి అని, స్త్రీవిద్యని ఎప్పుడూ ప్రోత్సహించింది అమ్మ. తను ఎక్కువ చదువుకోకపోయినా పిల్లలు చదవాలని ఆశపడింది. చివరికి చనిపోయే ముందు రాత్రి కూడా తన దగ్గరున్న నైట్ నర్సు నాగమణికి పిల్లల్ని బాగా చదివించాలనీ, వాళ్ళకి ఏ ఆస్తులివ్వలేకపోయినా 'మనం ఇవ్వగలిగేది ఆ చదువొక్కటే' అని బోధచేసిందని నాగమణి తర్వాత చెప్పింది..................