గ్రంథ విమర్శ ఎలా....?
సంస్కృతంలో అవిమారకమనే నాటకమొకటి ఉంది. దాని కర్త భాసుడు. అందులో అవిమారకుడు తన ఆస్థాన విదూషకుణ్ణి ఉద్దేశించి చెప్పిన మాటలు తెలుగు విమర్శకుడికి కచ్చితంగా సరిపోతాయి. ఇదేమిటి? విమర్శకుడిని విదూషకునితో పోలుస్తున్నానంటూ కోపగించుకుంటున్నారా? చూడండి. విదూషకుడంటే కేవలం హాస్య పాత్ర మాత్రమే కాదు.
“గోష్ఠీషు హాస్యస్సమరేషు యోధః
శోకే గురుస్సాహసికః పరేషు
మహెూత్సవే మే హృది కిం ప్రలాపై
ద్విధా విభక్తం ఖలు మే శరీరమ్" (అవిమారకం - భాసుడు) (సమావేశాలలో హాస్య చతురుడు, యుద్ధ సమయంలో వీరుడు, దుఃఖ సమయంలో గురువు, ఎదుర్కొనేటప్పుడు సాహసి, సంతోష సమయాల్లో తన శరీరంలో అర్ధభాగం.) ఈ అవిమారక విదూషకుల సంబంధం లాంటిదే కవి విమర్శకుల సంబంధం.
కొందరు విమర్శకులు విదూషకుల్లాగా హాస్యరస తానంగా కనిపించినప్పటికీ వీరుల్లా, గురువుల్లా, సాహసులుగా కవిహృదయ మెరిగిన అర్ధశరీరుల్లా కనిపించే విమర్శకులు మనకు లేకపోలేదు. ఒక్కొక్కదానికి ఒక్కో ఉదాహరణ ప్రత్యేకంగా సమన్వయంచేసి చూపవచ్చు. ప్రస్తుత కర్తవ్యం వేరు కాబట్టి దానినలా ఉంచుదాం.
విమర్శ చేయడం ఎలా? అంటే పిల్లల్ని చదివించటం ఎలా? అని ప్రశ్నించటం లాంటిదే. అన్నం తినిపించటం ఎలా? అన్న ప్రశ్న లాంటిదే! నా చిన్నతనంలో సంగీతం నేర్పిద్దామని మా నాన్న నన్ను ఒక సంగీత విద్వాంసుని వద్దకు తీసుకుపోయాడు. ఆయన సంగీతం తరువాత నేర్పించవచ్చు. ముందు వినటం బాగా అలవాటు చేయించు. దానిని ఆస్వాదించటం, ఆనందించటం నేర్పించు..................