కథలు రాయడం నేర్పే పాఠాలు
చెహెూవ్ కథలన్నీ తెలుగులోకి తీసుకువస్తున్నామని కుమార్ కూనపరాజు గారు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషమనిపించింది. అది ఇంత తొందరలో కార్యరూపం ధరిస్తుందనీ, మొదటి వంద కథలు ఇలా పుస్తక రూపంలో మీ చేతుల్లోకి వస్తాయనీ నేను ఊహించలేకపోయాను. ఇది తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా కథా ప్రక్రియకి అపురూపమైన కానుక అని భావిస్తున్నాను.
సాధారణంగా కొత్తగా కథలు రాస్తున్నవాళ్ళు కొన్నాళ్ళు గడిచేక, తాము రాస్తున్న కథల వస్తువు పట్ల కాక, శిల్పం గురించి ఆలోచిస్తూ ఉండటం సహజం. కథలు ఎలా రాయాలి, కథని నిర్మించడంలో పాటించవలసిన నియమాలు, పద్ధతులూ ఉన్నాయా అనే విచికిత్స వాళ్ళల్లో మొదలవుతూండటం సహజం. ఈ మధ్య నేను పాల్గొన్న రైటర్స్ మీట్ లో కూడా నన్ను ఈ విషయం మీదనే మాట్లాడమని అడిగారు. కూడా.
కథ అంటే ఆధునిక కథానిక, ముఖ్యంగా, పాశ్చాత్య ప్రభావంతో రూపుదిద్దుకున్న చిన్నకథ అనుకుంటే, ఆ కథాశిల్పం గురించి తెలుగులో చెప్పుకోదగ్గ పుస్తకాలు లేవు. ఉన్న ఒకటీ అరా కూడా కొత్తగా కథలు రాస్తున్నవాళ్ళని చేయిపట్టుకు నడిపించడానికి ప్రయత్నిస్తాయి తప్ప, దారి చూపించేవిగా లేవు. ఈ నేపథ్యంలో చెహెూవ్ కథలు మొత్తం తెలుగులోకి అనువాదం కావడం నిస్సందేహంగా ఎంతో
ప్రయోజనకారి.
ఒకప్పుడు బ్రిటిష్ యువరాజు ఒక ప్రసిద్ధ నీటిరంగుల చిత్రకారుణ్ణి తనకు చిత్రాలు ఎలా గియ్యాలో నేర్పమని అడిగాడట. అందుకు ఆ చిత్రకారుడు తనకి బొమ్మలు వెయ్యడం మాత్రమే తెలుసనీ, ఎలా వెయ్యాలో నేర్పడం తెలియదనీ, రాకుమారుడు చిత్రాలు గియ్యడం నేర్చుకోదలచుకుంటే, తాను బొమ్మలు వేస్తుండగా చూడటమొక్కటే మార్గమనీ చెప్పాడట. ఈ మాట కథానికా ప్రక్రియకి కూడా వర్తింపచెయ్యవచ్చు. కథలు ఎలా రాయాలో ఎవరో చెప్తే నేర్చుకోవడంకన్నా చెహెూవ్ కథలు మనమే నేరుగా చదవడం వల్ల కథా రచన సూత్రాలు సులభంగా పట్టుబడతాయి. ఇవి కథలు రాయడమెలానో నేర్పే పాఠాలు. జీవితాన్ని ఒక కథకుడు...........