అనుబంధాలు
బసవన్న కొండ మెట్లెక్కుతూ ఉన్న వేదమూర్తికి బాల్యం నుండి గత జీవితమంతా తెరలు తెరలుగా స్ఫురణకు వచ్చింది. కన్నులకు కట్టినట్లవుతూన్న కొన్ని జ్ఞాపకాలతో, తాను మళ్లీ ఆ క్షణాల్లో జీవిస్తూ ఉన్నట్లే కలిగిన హృదయావేగంతో, వెంటవస్తున్న రామయ్యనుకూడా మరచిపొయ్యాడు.
బస్సులో ఆ ఊరివైపు ప్రయాణంచేసేవాళ్లకు అయిదారు మైళ్ల దూరంనుండే, ఒక పెద్దకొండ నందీశ్వర రూపంలో సాక్షాత్కరిస్తుంది. అదే బసవన్నకొండ. శివాలయంలో కనుపించే బసవయ్య రూపంలో ఉండటంవల్ల పోలికనుబట్టి కొండకూ, కొండప్రక్కనున్న గ్రామానికీ ఆ పేరు వచ్చింది. ఆ బసవయ్య మూపురము మీదే వెలసి ఉంది పూర్వమెప్పుడో నిర్మింపబడిన మల్లికార్జునుని దేవాలయం. గ్రామస్థులు ఆ దేవాలయాన్ని శ్రద్దతో రక్షిస్తూ వచ్చారు. శివరాత్రికి ఏటేటా పెద్ద ఉత్సవం జరుగుతుంది. గ్రామంలోని వారందరూ, స్త్రీలు, పిల్లలు కూడా ఆ సమయంలో తప్పకుండా కొండ పైకెక్కి వెళ్లుతారు. ఎక్కవలసిన దూరం సుమారు రెండు మైళ్లుంటుంది...
"ఏటేటా వందరూపాయలిచ్చే ఈశ్వరరెడ్డి ఈసారి జరిగిన ఉత్సవానికి యాభై మాత్రమే ఇచ్చేడు. కారణం తను కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ పార్టీకి విరాళమిచ్చేడు. అందుకని” అన్నాడు రామయ్య, గ్రామంలో విషయాలేవో చెప్పుతూ.
వేదమూర్తి పరధ్యానంలో వినిపించుకోలేదు. రామయ్య కూడా మరి తర్వాత మాట్లాడ లేదు.............