“నీకు పెళ్లాం పుట్టిందిరా...!" అంది నేను బడి నుంచి రాగానే మా పార్వతమ్మ పెద్దమ్మ.
ఆమె యేమందో నాకర్థం కాలేదు. నాకు పెళ్లాం పుట్టటం యేమిటి? ఎప్పుడూ నాతోగానీ, మా అమ్మతోగానీ ఎక్కువగా మాట్లాడని పార్వతమ్మ పెద్దమ్మ అలా ఎనిమిదేళ్ళ నన్ను పట్టుకొని “నీకు పెళ్ళాం పుట్టింద”ని చెప్పటమేమిటి? ఆమె ఎప్పుడూ అమ్మతోటో, నాన్నతోటో యేదో విషయంలో పంచాయితి పెట్టుకుంటూనే ఉంటుంది. ఆమె నోరు మంచిది కాదని మా ఇంట్లో అందరూ అనుకోగా విన్నాను. ఎప్పుడూ ఎవర్నో ఒకర్ని తిడుతూనే ఉంటుంది.
నేను మా అమ్మ దగ్గరకు వెళ్ళి పార్వతమ్మ అలా ఎందుకన్నదని అడిగాను. అమ్మ ఆశ్చర్యపడింది.
"ఎప్పుడైనా ఆమె నీతోటి వీసమెత్తు మాటైనా మాట్లాడిందా? గట్లాటి ఆమె నీతోటి గట్ల మాట్లాడిందంటే నాకు నమ్మబుద్దయితలేదు" అంది అమ్మ.
"ఆమె గట్ల ఎందుకన్నదో చెప్పమ్మా?" అన్నాను.
"యేం లేదురా... మా అమ్మగారింట్లో మీ నడిపిమామ భార్య లక్ష్మత్త గుర్తుందా?" "గుర్తుంది.... ఆమె నన్ను ఎప్పుడు చూసినా నాకు అమ్మాయి పుడే నీకే ఇచ్చి పెండ్లిజేస్త అంటూ నా చెంపలు పిండేది" అన్నాను.
"గా మాట నీకు గుర్తుంది గద... ఆమెకిప్పుడు ఆడపిల్ల పుట్టిందని గిప్పుడే మద్దిరాల నుండి మనిషొచ్చి చెప్పిండు. గా వార్త తెలియగానే గీ ఇంట్లో అందరూ నీకు పెండ్లాం పుట్టిందని గుసగుస పెట్టుకున్నరు. పార్వతమ్మగారి నోట్లో మాట ఆగదు కాబట్టి ఆమె మనసులో ఉన్న మాట నువ్వు కనబడంగనే అనేసింది" అంది అమ్మ..................