పెండ్లి పట్టుమని పది రోజులు గూడ లేదు. పెండ్లి గాజులు తీస్కక రమ్మని గాజుల మోనయ్యన్న ఇంటికి ఎన్నిసార్లు బొయ్యి చెప్పొచ్చిన ఇప్పటిదాన్క అజా పజా లేడు,” పెండ్లి సారెకు పొయ్యాల్సిన పచ్చపిండి కోసం విసుర్రాయి మీద పిండి విసురుతూ చేను దగ్గర్నుండి అప్పుడే వచ్చిన పెనిమిటితో అంది బుచ్చమ్మ.
పాపయ్య చేతిలోని ముల్లు గర్రను కోళ్ళ గూటి మీద అడ్డంగా పడేసిన పాపయ్య "అసలే లగ్గసరి రోజులాయే సుట్టు ముట్టు నాలుగూల్లకు గాజుల బేరగాడు మోనయ్య ఒక్కడేనాయె. పొద్దునలేస్తె గాజుల మలారం సంకనేస్కోని యాడాడ తిర్గుతుందో? ఏం కతనో? జర ఓపిక పట్టరాదు. ఇయ్యాల రేపల్లె వస్తడేమో, ఎందుకట్ల గాబరైతవ్?” చేదబాయి మీదికి పొయ్యి నీల్లు తోడుకుని బక్కెట్టుతోనే వంటి మీద బొల బొలా గుమ్మరించుకొంటూ బదులిచ్చాడు.
విసుర్రాయి ముందు నుండి లేచిన బుచ్చమ్మ పక్కనే వున్న దండెం మీది తువ్వాల తీసుకుపోయి పెనిమిటికి అందిస్తూ "నీతో పెట్టుకుంటే ఏ పనైన ఇట్లనే వుంటది 'సై' అంటే ఆరు నెల్లు అన్నట్టు మాట్లాడవ్,” అంది విసురుగా
తువ్వాలతో ఒల్లు తూడ్చుకుంటూ ఇంటి ముందు కొత్తగా వేసిన తాటాకు పందిరి కింద కొచ్చిన తండ్రికి త్వరలో పెండ్లి కాబోతున్న లక్ష్మీనర్సమ్మ తెల్ల పంచ తెచ్చి అందించింది......................