చీకటి వెలుగులు
అసలు నేను జీవితంలో నీతిని గురించి ఇంత ఆలోచిస్తానని, ఇంత ఆలోచించవలసిన అవసరం నా జీవితంలోనే ఏర్పడుతుందనీ ఎప్పుడూ అనుకోలేదు నేను. నా పెళ్లి అయ్యేవరకే కాదు, అయిన రెండేళ్ల దాకా కూడా అదే అభిప్రాయం. ఆ అభిప్రాయానికి అంతరాయం కలగలేదు.
నాకు బాగా గుర్తుంది ఆ రోజు. దానికి ముందటి రోజే అన్నయ్య నాతో "చూపులకి వెళ్లాలి" అన్నాడు.
అన్నయ్య అని ఊరుకున్నాడు. కానీ నాలో ఎన్ని ఆలోచనలు! ఇదే మొదటి సారి పెళ్లి చూపులకు వెళ్లటం. ఆ అమ్మాయి చాలా బాగుంటుందని విన్నాను.
"పెళ్లి చూపులకు వెళ్లాలి ”
వెడతాను. చూస్తాను. ఆ అమ్మాయి నచ్చుతుంది. మా ఇద్దరికీ పెళ్ళయిపోతుందా? ఇంతవరకూ పరిచయమైనాలేని ఆ అమ్మాయి నాదైపోతుంది. నాకూ ఒక స్నేహం, తోడు నీడా లభిస్తాయి. నా కలలకి అర్థం దొరుకుతుంది. నా కోరికలు నెరవేరుతాయి. నా జీవితంలోకి మాధుర్యం వస్తుంది. నా బ్రతుకు పరిమళం అడ్డుకుంటుంది. ఆమె నాకు భార్య అవుతుంది.
భార్య!
ఆ మాటలో ఎంత నిండుతనం ఉంది!
ఎంతటి సుఖం అవనీ ఆవిడలేకుండా అనుభవించలేను.
ఎంత దుస్థితి రానీ ఆమె భుజం మీద చేయి వేసి అవలీలగా అధిగమిస్తాను. సర్వకాల సర్వావస్థలలో ఆమె నా పక్కనే ఉండాలి. నేను ఉంటే ఆమెకు ఇంకేమీ అవసరం లేదు. నా సహచర్యంలో ఆమె తన జీవితార్థం పొందాలి. ఆమెకి నేను ఇవ్వనిది ఏమి ఉంటుంది! ఆమె కోసం, ఆమె తృప్తి కోసం నేను చెయ్యనిదేదీ ఉండదు.
ఆమె పుట్టి ఇరవై సంవత్సరాలు, ఎక్కడో విడిగా పెరిగింది. నేను రేపు చూస్తాను ఆమెని. అప్పుడే ఆమె నాకు పరిచయమై పోతుంది. నాకు తెలుసు - ఆమె నాకు...................