భావకవి - బాధ్యతగల కవి
స్పందించే హృదయం నుండే కవిత్వం జాలువారుతుంది. కవిహృదయం అక్షరమైతే అది కవిత్వమౌతుంది. మురళీధర్ గారిది రసహృదయం. ఆయన హృదయం నుండి ఆవిష్కృతమైన ప్రతీదీ కవిత్వమే. అది రసభరితమే. రసరమ్యమైన కవిత్వాన్ని ఆస్వాదించిన సహృదయుని హృదయం కూడా రసానందభరితమౌతుంది. రసరమ్యంగా, భావగంభీరంగా నడిచే ప్రక్రియ గజల్. ఎవరైనా గజల్ రాశారంటే, వారు భగ్నప్రేమికులైనా అయి ఉండాలి. లేదా ప్రేమనిండిన హృదయం కలవారైనా అయి ఉండాలి. మురళీధర్ గారి 'అర్థ నూటపదహార్లు' గజల్స్ చదివాక, ఆయనలో ప్రేమనిండిన హృదయం, భగ్నమైన హృదయం రెండూ కనిపించాయి. “నాగుండియనే కోవెల చేసానే నీకోసం - నీ ఊహలు. ఊపిరిగా బతికానే చిలకమ్మా" అన్నప్పుడు కవిలో భగ్నహృదయం కనిపిస్తుంది.
"కన్నీటిని తుడుచుటలో కష్టాలను గెలుచుటలో - ఆనందం దాగుందని ఎరిగిందే నాహృదయం" అన్నప్పుడు కవి ప్రేమకు చిరునామా కనుగొన్నారనిపిస్తుంది. ప్రేమకు పరమార్ధం ఆవేదనతో అంతం కావడం కాదు. ఆలోచనతో అడుగులు వేయడం. అందుకే కవి ప్రేమకు అర్థం చెప్పే ప్రయత్నం చేశారు.
"సహకారం సమభావం అలవాటుగ పాటిస్తే - ప్రేమంటే ఇవ్వడమని తెలిసిందే నాహృదయం". - ఇది ప్రేమకు కవి చెప్పిన కవిత్వరూప నిర్వచనం.
ప్రేమించిన కంటికి లోకమంతా ప్రేయసిగానే కనిపిస్తుంది. "పరీక్షలో పటమనుకొని వేసానే నీరూపం" అంటారు మురళీధర్. అద్భుతమైన భావచిత్రం.
ప్రేయసికి పలికే ఆహ్వానంలోనూ అమృతాన్ని కురిపించారు. "ఎండిన నేలను తడిపే చినుకులాగ రాలేవా?" అంటారు. నేల తడిస్తేనే మొక్క మొలుస్తుంది. .......................