అమెరికా కథా, కమామీషూ.. అలా మొదలయింది...
అది ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రిక ఏప్రిల్ 17, 1964 సంచిక. ఆ పత్రికలో 'మనలో మన మాట' అనే పది వాక్యాల సంపాదకీయంలో ఆ తరువాత వారం వచ్చే పత్రిక గురించి వ్రాస్తూ, చివరి వాక్యంగా, 'ఆ సంచికలో అందరికీ ఆనందం కలిగించే విశేషం ఒకటి ఉంటుంది' అని ఆనాటి లక్షలాది పాఠకులని ఊరించారు సంపాదకులు శివలెంక వారు. ఆ తర్వాత ఏప్రిల్ 24, 1964లో 32వ పేజీలో 'ఆర్ఫియస్' కలం పేరుతో వచ్చిన వాహిని అనే కథ ప్రచురించి 'మనలో మన మాట' సంపాదకీయం మొదటి పేరాలోనే, ‘ఆర్ఫియస్ ప్రస్తుతం కెనడాలోని ఓట్టావా యూనివర్శిటీలో న్యూక్లియర్ కెమిస్ట్రీ శాస్త్రంలో పిహెచ్.డి.కి కృషి చేస్తున్నారు,' అని పరిచయం చేసి, 'అందరికీ ఆనందం కలిగించే విషయం ఒకటి ఈ సంచికలో ఉంటుంది అని వ్రాశాము. అదేమిటో వేరే చెప్పక్కరలేదు,' అని వ్రాశారు.
అదేమిటో ఇప్పుడు చెప్పాలి. అదే ఉత్తర అమెరికా నుంచి వెలువడిన మొట్ట మొదటి తెలుగు కథ. ఉత్తర అమెరికా నుంచి ఒక తెలుగు కథ ప్రచురణకి రావడం ఆనాటి తెలుగు సాహిత్య ప్రపంచానికి ఆశ్చర్యం, ఆనందం కలిగించిన విషయం. ఆ కథ పేరు వాహిని. రచన 'ఆర్ఫియస్' అనే కలం పేరు. ఆయన అసలు పేరు పులిగండ్ల మల్లికార్జునరావు. 40 ఏళ్ల పిన్నవయసులోనే 1978లో పరమపదించారు. “డయస్పోరా కథ" అంటే ఎవరి నిర్వచనం ప్రకారం చూసినా అదే మొట్టమొదటి అమెరికా తెలుగు డయస్పోరా కథ... లేదా డయస్పోరా తెలుగుకథ.
కొన్నేళ్ల స్తబ్ధత తరువాత, 1970 ఏప్రిల్లో శ్రీమతి చెరుకూరి రమాదేవిగారి 'పుట్టిల్లు', కోమలాదేవిగారి 'పిరికివాడు', కస్తూరి రామకృష్ణారావుగారి 'యవ్వన కుసుమాలు వాడిపోతే' అనే మూడు కథలు కీ.శే. పెమ్మరాజు వేణుగోపాలరావుగారు ప్రధాన సంపాదకులుగా అమెరికాలో అట్లాంటా నగరంలో మొదలైన 'తెలుగు భాషా పత్రిక' మొదటి సంచికలో ప్రచురించబడ్డాయి. వీరిలో రమాదేవిగారు (డిట్రాయిట్) ఇప్పటికీ ఎంతో ఉత్సాహంగా రచనావ్యాసంగం కొనసాగిస్తున్నారు. మిగిలిన ఇద్దరు కథకుల వివరాలు తెలియవు..........................