శరీరం అంటే దేహం, మనసు, ఆత్మల కలయిక. ఈ మూడింటి కలయికా ఆరోగ్యంగా కొనసాగడానికి అవసరమయిన సిద్ధాంతాలూ, విజ్ఞానం ఉన్న పరిపూర్ణ వైద్యశాస్త్రం ఆయుర్వేదం. వేలసంవత్సరాలుగా మానవుల ఆరోగ్య రక్షణకి శ్రీరామరక్షగా ఉన్నదీ శాస్త్రం. ఆయుర్వేదంతో పాటుగా యోగశాస్త్రాన్ని కూడా కలిపినట్లైతే, ఈ రెండూ మానవుల ఆరోగ్య రక్షణకి మరింత దోహదపడతాయి. ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి. ఈ రెండు శాస్త్రాల విజ్ఞానాన్నీ కలిపి వైద్యం చేస్తే మానసిక ఆరోగ్యం, తద్వారా శారీరక ఆరోగ్యం ఏ విధంగా మెరుగుపడతాయి అనే అంశం మీదే నా పరిశోధన. అన్ని అనారోగ్యాలకీ యోగ ఆసనాలే మార్గంగా అజ్ఞానంతో చెప్పడం సరికాదు. ఎటువంటి సమస్యలలో యోగ విజ్ఞానాన్ని కలిపితే మెరుగైన వైద్యం చేయవచ్చు. అనే నా పరిశోధనలోని వివరాలలోకి వెళ్ళడానికి ముందు, ఆయుర్వేద మూలసిద్ధాంతాల గురించి తెలియచేస్తాను. శాస్త్ర పరిజ్ఞానానికీ, పరిశోధనకీ కూడా మూలసిద్ధాంతాలే మూలం.
1.1. ఆయుర్వేద అవతరణ
వైద్యశాస్త్రం అతి పాచీనం. ప్రతి ప్రాంతంలోని మానవజాతీ ఏదో ఒక చికిత్సా మార్గాలను అనుసరిస్తూండేది - కొన్ని ఔషధాలు, మంత్రాలు, తంత్రాలు, ఇలా ఏదో ఒక పద్ధతిని నమ్ముకున్నారు. ఒక్కొక్క ప్రాంతంలో ఉన్న పరిసరాల ప్రభావంతో, అక్కడి నాగరికతను అనుసరించి ఆ శాస్త్రం అభివృద్ధి చెందుతూ ఉంటుంది.................