ఆరునెలలు ఆగాలి
చారులత ఆత్రంగా పక్క మీదనుంచి లేచి వాకిటి తలుపు తీసింది పేపరు పడ్డ చప్పుడవటంతో. గేటవతలనుంచి విసిరేసిన పేపరు సరిగ్గా తలుపుకు తగిలి క్రిందపడింది.
ఆమె నైటీలో వున్నది. పొడువైన జుట్టును చుట్టగా చుట్టుకొని, వంగి పేపరందుకొని, లోపలకు వచ్చి, గదిలో లైటు వేసి, కుర్చీలో కూర్చుంటూ పేపరు మడతలు విప్పింది. ఒక్కొక్క పేజీ తిప్పుతుంటే ఆమెకు ఆత్రుత హెచ్చుతోంది.
ప్రత్యేకంగా మెయిన్ పేపర్లోనే బాక్స్ కట్టి మరీ వేయాలని, అందుకుగాను ఎక్కువ డబ్బే ఇచ్చింది.
పదహారు పేజీల ఆ ఇంగ్లీషు పేపర్లో పది పేజీల వరకూ తనిచ్చిన ప్రకటన కనబడక పోవటంతో నిరాశపడింది ఇంకోరోజు ఆగాలేమోనన్నట్లుగా. అలాంటి సమయంలోనే ఆమెను ఉత్సాహపరుస్తూ పదకొండో పేజీలో కుడివైపుగా మధ్యలో బాక్స్, అందులో తనిచ్చిన ప్రకటనా కనబడింది. ఆమె త్వరత్వరగా చదవటం మొదలు పెట్టింది.
ప్రకటన
ఇంకో ఆరు నెలల్లో నాకు పుట్టబోయే బిడ్డను ఎవరికైనా పెంచుకోవాలనే ఆసక్తి వుంటే ఈ క్రింది నంబరుకు ఫోను చేసి వివరాలు తెలుసుకోండి. అలా ఫోను చేసే వారికి పుట్టబోయే బిడ్డ ఆడ, మగయినా అభ్యంతరం ఉండకూడదు.
- చారులత. పేరు క్రింద సెల్ నంబరు ఇచ్చింది.
అచ్చులో, ఇంగ్లీషులోవున్న ఆ ప్రకటనను చూస్తుంటే మనస్సుకు ఎంతో హాయిగా ఉ న్నట్లనిపించింది. ప్రశాంతత చేకూరినట్లే అనిపించింది.
దీన్ని చూచింతరువాత శ్రీనివాస్ ముఖం ఎలా ఉంటుందో కళ్ళముందు ఊహించుకుంటూ చేతిలోని పేపర్ను విసురుగా అవతల పడేసి, తలుపేసి, లైటార్పి, వెళ్ళి బెడ్ రూంలో మంచం మీద పడుకున్నది. కొత్తగా రంగులేసిన ఆ డబుల్ బెడ్ రూం ఇంట్లో ఆ క్షణాన ఆమె ఒక్కతే ఉన్నది. ఏదో వెగటు వాసన...