భారతీయులు తమ నిత్య కర్మలలోను, వివాహాది శుభ కార్యలలోను సంకల్పం చెప్పుకొని ఆచరించటం అనాదిగా వస్తున్న ఆచారం. అందు జంబూద్వీప భరతఖండ భారతవర్షముల ప్రసక్తికనబడుతుంది. నిత్య కర్మలలో చెప్పుకునే సంకల్పం చిన్నదిగాను ఉపనయన వివాహాదులో చెప్పుకునే సంకల్పం పెద్దదిగాను (మహా సంకల్పంగాను) ఉంటుంది. చిన్న సంకల్పం ప్రారంభం ఈ విధంగా ఉంటుంది.
ఓం తత్సత్ అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రహర ఉత్తరార్ధ (లేదా ద్వియే పరార్ధే) శ్వేత పరాహకల్పే, సప్తమే వైవస్వత మనన్వంతరే, అష్టావింశతి తమే చతుర్యుగే, కలియుగే కలి ప్రథమచరణే, జంబూద్వీపే, భరతఖండే, భారతవర్షే, ఆర్యావర్త పుణ్యభూమా, మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య...
పరమేశ్వరునిచే రచింపబడిన ఈ సృష్టిలో ప్రస్తుతం ద్వితీయ ప్రహర ఉత్తరర్ధాలలో సప్తమ వైవస్వతమన్వంతరం జరుగుతోంది. అందులోనూ 37 చతుర్యుగాలు గడిచిపోయాయి. 28వ చతుర్యగంలోని కలియుగం జరుగుతోంది. అట్టి సమయంలో మనం జంబూద్వీపంలోని భరతఖండంలో ఉన్నాం. అందులోనూ భారతవర్షంలో (భారతదేశంలో ఉన్నాం). దీనినే ఆర్యావర్తమని పూర్వం చెప్పుకునేవారు. ఈ దేశం మేరు పర్వతానికి దక్షిణంగా ఉంది. మేరుపర్వతం మనకు చాలా దూరంగా ఉంది. కనుక మనకు దగ్గరలో ఉన్న శ్రీశైలపర్వతానికి ఏ దిశలో ఉన్నామో చెప్పుకోవడం జరుగుతోంది. అనంతరం ఏ నదుల మధ్య ఏ ప్రదేశంలో ఉన్నామో ఏ తిథి వార నక్షత్ర యోగ కరణాదులుగల దినం ఆ కర్మచేయుచున్నామో, ఎందుకొరకు చేయుచున్నామో చెప్పుకుంటారు. దీనినే సంకల్పం (వృతదీక్ష) అంటారు. ఈ సంకల్పంలోని జంబూద్వీప భరతఖండ భారతవర్ష ఆర్యావర్తాలు ఎక్కడ ఉన్నాయి? మేరు పర్వతం ఎక్కడ ఉంది? హిమాలయాలు, మేరు పర్వతం ఒక్కటేన్నా? వేరువేరా? అనే ఆలోచించవలసిన విషయాలు. వీటిని గురించి పలువురుకు పలురకాల అభిప్రాయాలున్నాయి.
జంబూద్వీపాన్ని నవ వర్షాలుగా చేసి స్వాయంభువ మనువు కుమారుడైన ప్రియవ్రతుడు తన కుమారులకు పంచియిచ్చినట్లు మన గ్రంథాలలో కనబడుతుంది.. అందుచే భారతవర్ష జంబూద్వీపంలో తొమ్మిదవ భాగమై యున్నదని కొందరంటారు.............