ప్రేమికుడూ అతడే! సైనికుడూ అతడే!
చురుకైన చూపు. నల్లని మనిషి, తెల్లని మీసం.
నిలువెత్తు ఆవేశానికి సఫారీ తొడిగినట్లుంటాడు. ఎదురుగా వస్తే ఏంచేస్తాడో అనిపిస్తాడు. తీరా వచ్చాక, పగలపడి నవ్వుతాడు. మాట కలిపాక మెత్తబడిబోతాడు.
శత్రుభయంకరుడూ అతడే, మిత్రసంపన్నుడూ అతడే, అతడి వైరమూ స్వచ్చమే, స్నేహమూ స్వచ్చమే, నేను మిత్రులు లేని వాణ్ణయినా నమ్ముతాను కానీ, శత్రువులు లేనివాణ్ణి నమ్మను. 'అజాతశత్రువు' అన్నమాట పచ్చి అబద్దం. శత్రువు లేనివాడు నంగి, బతకనేర్చినవాడికే శత్రువులుండరు.
ఛత్రపతికే కాదు, చంటిబిడ్డ తల్లికి కూడా శత్రువులుంటారు. ఉండాలి. బిడ్డను అపహరించాలనుకున్న ప్రతీవాడూ ఆమెకు శత్రువే. కారణం ప్రేమ.
అతడూ ప్రేమికుడే. ప్రేమికుడంటే సైనికుడే.
అతణ్ణి ముప్ఫయిమూడేళ్ళ క్రితం చూశాను. చుట్టూ ప్రహరీగోడ, దానికో గేటు, లోపల భవనం.
చిన్నదే. కానీ గట్టిది.
గేటు తీసుకుని వెళ్ళబోయాను. మీదపడినంత పనిచేసింది. సింహం! కాదు. సింహం లాటి క్క అంతలోనే. నవ్వు, పెద్దనవ్వు. నిష్కల్మషమైన నవ్వు, అతడే. నేను చూసింది అతణ్ణి. సైనికుడే, పెద్ద సైనికుడు. మేజర్! అలా అనుకున్నాన్నేను. కానీ, కాదు. అతడు అన్న. బిక్షమన్న. నా సందేహాన్ని నివృత్తి చేశారు. నా వెనుక వున్న కవులు. కార్మికుడూ అతడే. నాయకుడూ అతడే. నాయకుడూ సైనికుడే.
రామగుండం, గోదావరిఖనిలకు వెళ్లటం అదే మొదటిసారి. మూడురోజుల ప్రజారచయితల మహాసభలు, మే నెల, వేడి, పొద్దున్నే ఎక్కడికక్కడ పొగ ఆవరించి వుంది. ఎటుచూసినా బొగ్గుల పొయ్యిలే. వాటిలోంచి తేనీటి వాసనలు. మధ్యాహ్న మయ్యాక వేడెక్కి తీరాల్సిందే. మూడురోజులయ్యా మేమంతా భగభగలాడుతున్నాం. కారణం మేమే బొగ్గుల పొయ్యిల్లా మారాం. రాజుకున్నాం. మాకు మేం కాక వేసుకున్నాం. మేం నమ్మిన సిద్ధాంతమే అలాంటిది...........