అధ్యాయం - 1
ఆత్మ సాక్షిగా - అందరిలో
మహాపండితుడు, విజ్ఞాని, రాజర్షి అయిన జనకుడు తన సందేహాలను, సమస్యలను ఆత్మనిష్ఠుడయిన అష్టావక్ర మునీంద్రుని ముందుంచి తీర్చ వలసిందిగా ప్రార్ధిస్తున్నాడు.
భగవంతుడన్నా, సత్యమన్నా, ఆత్మ అన్నా, ఏ పేరుతో పిలిచినా ఉన్నది ఒకే ఒక సత్యం. అదే ఇంద్రజాల సమానమయిన తన మాయా కల్పిత జ్ఞానంలో తానే చిక్కుకున్నట్లు, దేహ మనోబుద్ధులతో కూడిన జీవిగా, తాను చూస్తున్నాననుకునే ప్రపంచంలో వ్యవహరిస్తున్నట్టుగా, మనస్సుతో భావిస్తున్నది. తనలో అసంఖ్యాకములయిన రాగద్వేషాలను, నిశ్చయానిశ్చయా లను, ఆశనిరాశలను, అనుభవిస్తూ తనదైన ప్రపంచంలో మానసికానుభవం పొందుతూ ఉన్నట్టుగా జీవుడు భావిస్తున్నాడు. ఈ కర్తృత్వ భావన కారణంగా తత్ఫలితమయిన జన్మ కర్మచక్రంలో భ్రమిస్తున్నట్లుగా భ్రమపడుతున్నాడు. ఈ బాధలలో ఉండిపోకుండా బయటపడడానికి, తనకూ, జగత్తుకూ సృష్టికర్త అయిన జగదీశ్వరుని, ప్రార్థించాలనే కోరికతో ఏకాగ్రత పెరుగుతున్నది. ఈ ఏకాగ్రత, ఈ భావనాబలం తన పరిస్థితులు ననుకూలంగా మార్చి సరైన మార్గాన్ని చూపి సత్యమైన జ్ఞానాన్నందిస్తుంది. ఏ బుద్ధితో తానుగా, జగత్తుగా జగదీశ్వరుడుగా భావిస్తూ, భ్రమపడుతూ భ్రమిస్తున్నాడో అదే బుద్ధితో ఉన్నది. ఒకేఒక సత్యమనీ, అదే తాననీ, కనిపిస్తున్నట్టున్న దంతా భ్రమ అనీ తెలుసు కోవడంతో భ్రమాజన్య భావనా చక్రంలో భ్రమణం సమాప్త మవుతున్నది. అజ్ఞానం నశించి జ్ఞానం మిగిలిపోతున్నది. తిమిరం పోయింది, తేజస్సు మిగిలింది. జ్ఞానజ్యోతి నిశ్చలంగా, ఏకంగా, అద్వితీయంగా తానుగా ప్రకాశిస్తున్నది. నిత్యంగా................