ఈ నవలను గురించి...
గాంధీ నిర్యాణంనుంచీ చైనా దాడివరకు దేశచరిత్రలో ఒక అసురసంధ్య.
వార్తాపత్రికల్లో కనిపించే రాచకీయ, ఆర్థిక, సాంఘిక 'సామూహిక' పరివర్తన కాదు ఈ నవల ఇతివృత్తం. సంఘానికి ప్రాతిపదిక అయిన వ్యక్తిజీవితం, వ్యక్తి మనస్తత్త్వానికి సంబంధించిన పరివర్తన, దాని పరిశీలన, ఇందులోని వస్తువు.
కథానాయకుడైన శ్రీధర్ సామాన్య మానవుడు. ప్రతి భారతీయునిలోనూ కనిపించే దార్శనికత్వము, ఆదర్శ ప్రియత్వము (అది ఎన్నో రూపాలలో సాక్షాత్కరిస్తూ వుంటుంది) అతనిలోని విశిష్టత. పోతే ఆదర్శాలకూ అనుభవాలకుగల తేడాను గూర్చి భారతీయు లందరూ పట్టించుకోక పోవచ్చు. శ్రీధర్ ఎక్కువగా పట్టించుకోవడంవల్లే కథ. లేకపోతే కథే లేదు.
హైందవుడయిన ప్రతి భారతీయునికీ సంప్రదాయం (వేదాల నుంచీ గాంధీ గారి దాకా) ఒక పెద్ద బరువు. దాన్ని వ్యక్తిత్వంలోకి జీర్ణించుకుని, నిత్యజీవితంలో సునాయాసంగా ప్రయాణించడానికి పరిస్థితులు ఏ విధంగానూ అనుకూలంగా లేవు. సంప్రదాయాన్ని మోయలేక నడుములు విరిగినవాళ్ళూ, సంప్రదాయాన్ని బలవంతముగా వదిలించుకోవటం ఫలితంగా స్వశక్తి కోల్పోయి దారి కనిపించక బాధపడేవాళ్ళూ, సంప్రదాయాన్ని మోస్తున్న భక్తుల్లా నటిస్తూ అమాయకుల మీద స్వారిచేసే వాళ్ళూ - అంటూ కథా నాయకుల్ని మూడు రకాలుగా విభజిస్తే శ్రీధర్ మూడు రకాల్లో దేనికీ చెందడు. అది అతని విశిష్టత, అతని అదృష్టం.
ధర్మాన్ని ఆచరణకోసం యిదమిత్థమంటూ సిద్ధాంతీకరించ బూనటంవల్ల కలిగేది