ఒకటవ భాగం : పురుకుత్సుడు
1
శ్రీరామచంద్రుని పేరుతో పునీతమైన అయోధ్య ఇప్పుడు కుగ్రామమైంది. శ్రీరాముడు రావటానికి ముందు అంతటి కుగ్రామమేమీ కాదు. అయితే సామ్రాజ్యమూ కాదు. 30-40 గ్రామాలకు అధిపతియై రాజ్యభారాన్ని వహిస్తున్న శ్రీపురుకుత్స మహారాజుకు రాజధానిగా ఉండేది. పురుకుత్సుడు సుఖలాలసుడు. ఇతని రాణి నర్మదా పురుకుత్సాని. కాని భార్యతో అతనికి ఎలాంటి సంబంధమూ లేదు. ఎందుకంటే పురుకుత్సాని, పురుకుత్స మహారాజుకు చెల్లెలు కూడా. సూర్యవంశపు పద్ధతి ప్రకారం చిన్నతనంలోనే అతనికి చెల్లెలితో వివాహం జరిగిపోయింది. రాజవంశంలో బయటివారిని రాకుండా చేసే వ్యవస్థ ఇది. ఇజిప్షియన్ రాజవంశాల్లో సాగుతూ వచ్చిన పద్ధతి ఇది. పురుకుత్స మహారాజుకు పురుకుత్సాని తన చెల్లెలన్నది చివరి వరకూ మరవటానికి సాధ్యం కాలేదు. వారికి పిల్లలూ కలగలేదు. రాజవంశపు సమాన అధికారిణి అయిన పురుకుత్సాని తన ప్రతిభతో సోదరుడు, భర్త కూడా అయిన పురుకుత్సడి రాజ్యాధికారాన్ని భద్రంగా చేతిలో పెట్టుకుని నిజమైన రాజిలా పాలించసాగింది. అయితే సంసార సుఖమన్నది ఆమెకు అందని విషయమైంది. రాజవంశపు ఈ ప్రత్యేకమైన వివాహ పద్ధతి ఎలా మాయమైందన్నదే మన నవల ఇతివృత్తం.
2
“కాలియా” పురుకుత్స మహారాజు పిలిచారు.
"మహారాజా" కాలియా పరుగెత్తుకొచ్చి నమస్కరించి నిలిచాడు.
"తార్క్ష్యుడు వచ్చాడా?” పురుకుత్సుడు మధుపానీయాన్ని మరొక గుక్క తాగుతూ ఉత్కంఠతో అడిగాడు.
"ఇంకా రాలేదు ప్రభూ!" అన్నాడు కాలియా.
"రాగానే లోపలికి రమ్మని చెప్పు!" అన్నాడు మహారాజు.
మహారాజు అలా అడగటం నాలుగవసారి.
కాలియా చెప్పటమూ నాలుగవసారి.
"అలాగే ప్రభూ!”................