ఫిలాసఫీ; ఎవరికి అవసరం?
(మార్చి 6, 1974 నాడు వెస్ట్ పాయింట్లో యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడెమీ వాళ్ళ గ్రాడ్యుయేటింగ్ క్లాసులో చేసిన ప్రసంగం)
నేను ఫిక్షన్ రచయిత్రిని కాబట్టి ఒక చిన్న కథతో మొదలు పెడతాను. మీరొక అంతరిక్ష యాత్రికుడని అనుకోండి. మీరు ప్రయాణిస్తున్న అంతరిక్షనౌక అదుపు తప్పి వివరం తెలియని ఒకానొక గ్రహంమీద కూలిపోయిందనుకుందాం. తెలివి వచ్చాక, అంతగా దెబ్బలు తగల్లేదని గ్రహించారు మీరు. అప్పుడు మీ మనస్సులో మెదిలే మొదటి మూడు ప్రశ్నలు ఏమై ఉంటాయంటే, 1. నేనెక్కడున్నాను? 2. ఆ విషయం నాకెలా తెలుస్తుంది? 3. నేను ఏం చెయ్యాలి?
మీరు ఎరగని చెట్టూ చేమలూ ఉన్నాయక్కడ. పీల్చుకునేందుకు గాలి ఉంది. ఎండ, మీరెరిగిన ఎండకన్న లేతగానూ, చల్లగానూ ఉంది. ఆకాశం కేసి చూడబోయి ఆగిపోయారు. ఉన్నట్టుండి మీకొక ఆలోచన వచ్చింది. మనం చూడడం మానేస్తే 6 'భూమినుంచి చాలా దూరంలో ఉన్నాం, తిరిగి వెళ్ళడం అసాధ్యం' అని తెలుసు కోవాల్సిన అవసరం ఉండదనుకుంటారు. తెలియనంత సేపూ ఇష్టం వచ్చినట్టు ఊహించుకునే స్వేచ్ఛ ఉంటుంది కదా అని. అప్పుడు మీకు మసకమసకగా, సంతోషదాయకంగా, కానీ ఒకరకమైన అపరాధభావనతో కూడిన, ఒక ఆశ కలుగుతుంది.
మీ పనిముట్లను చూసుకుంటారు. అవి పాడయిపోయి ఉండొచ్చు. ఎంత చెడిపోయాయి అన్నది మీకు తెలియదు. ఆగిపోతారు. ఉన్నట్టుండి భయమేస్తుంది. ఈ పనిముట్లను ఏ మేరకు నమ్ముకోవచ్చు? ఇవి తప్పుదారి పట్టించవని నమ్మక మేమిటి? మరో ప్రపంచంలో ఇవి పనిచేస్తాయో లేదో ఎలా తెలుస్తుంది? పనిముట్లు వదిలేస్తారు.
'అవునూ! ఏమీ చెయ్యాలనిపించడం లేదేమిటి?' అని ఆశ్చర్యపడతారు. ఎలాగో ఏదో జరిగితే బావుండునని ఎదురుచూడడం ఎంతో క్షేమం అనిపిస్తుంది. ఆ నౌకను కుదపకపోవడమే మేలనిపిస్తుంది. దూరంగా ఒకరకం జీవులేవో మీకేసి వస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్లు మనుషులవునో కాదో మీకు తెలియదు. కానీ వాళ్లు రెండు కాళ్ళజీవులే. 'నేనేం చెయ్యాలో వాళ్లు చెబుతార్లే' అని నిర్ధారించుకుంటారు..................