సంస్తవం
వ్యాకరణ విదుషి
భాషాప్రవీణ డా. దావులూరి కృష్ణకుమారి
బాలావబోధంగా సూత్రం వృత్తి ఉదాహృతి రూపంలో భాషా తత్త్వాంశాలను వర్ణించిన వర్ణనాత్మక వ్యాకరణం బాలవ్యాకరణం. ఇది సంస్కృత, పూర్వాంధ్ర వ్యాకరణాల సంప్రదాయ ఆదరణంలో వీటి సంగ్రహశక్తిలో శాస్త్ర శిఖరం వంటిది. వ్యాఖ్యాన సాపేక్షతో లక్షణవాఙ్మయాన్ని విస్తరింపచేసిన వైయాఖ్యసంవిదం కలది.
ఈ వైయాఖ్యం వాఖ్యాతృవ్యుత్పన్నతనుబట్టి ఒకదాని వెంట ఒకటిగా మూలగంభీరార్థ సందర్భాలను సుబోధకం చేస్తూపోతుంది. శాస్త్రవ్యాఖ్యాన స్వరూపం పట్ల ఒక అంచనాకు రప్పింపచేస్తుంది. కావ్యప్రయోగాలను శిష్టభాషాలక్ష్యాలను వాటిసాధుతలోని మతభేదాలను వాటిప్రక్రియను పరామర్శింపచేస్తుంది. శాస్త్రచర్చలను తర్కింపచేస్తుంది. ప్రయోజనోద్దిష్టంగా వాడుకతీరును అందింపచేస్తుంది. ఈరకం నిరంతర చైతన్యది ఈ ఆంధ్రవ్యాకరణ వ్యాఖ్యానశాస్త్రం. తరుగని మెరుగులతో అటు 'పండిత’ వ్యాకరణంగా ఇటు 'బోధన' వ్యాకరణంగా పెద్దపిన్నల పరంపరలో ప్రశస్యతరమైంది ఈ వైయాఖ్యవ్యాకరణం. ఈ శాస్త్రముని పరవస్తు చిన్నయసూరి (1809-1862).
వివృతి అవతారిక:
వ్యాఖ్య అంటే వివరించి చెప్పేది అని అర్థం. కాలానుసారం అడుగులు వేసిన బాలవ్యాకరణ వ్యాఖ్యాన రచనల్లో సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రిగారి వివృతి ఒకటి. ఇది టీకారూపం. ఉన్నంతలో సూత్రవివరణం లక్ష్యలక్షణ సమన్వయం అనే..............